పంచాయతీల్లో కాంగ్రెస్ సునామీ!
ఇందిరమ్మ పాలనపై ప్రజల విశ్వాసానికి ఘన ముద్ర
భద్రాద్రి జిల్లాలో 70% పంచాయతీలు క్లీన్ స్వీప్
గ్రామ స్థాయి కార్యకర్తలే విజయంలో అసలైన శక్తి
మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి
ఐదు నియోజకవర్గాల ప్రజాప్రతినిధులకు అభినందన సభ
కాకతీయ, కొత్తగూడెం : గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ప్రభంజనం సృష్టించిందని, ఇది ఇందిరమ్మ పాలనపై ప్రజలకు ఉన్న నమ్మకానికి నిదర్శనమని తెలంగాణ రెవెన్యూ, గృహనిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి అన్నారు. ప్రజా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జరిగిన ఈ ఎన్నికల్లో గ్రామీణ ప్రజలు స్పష్టమైన తీర్పుతో కాంగ్రెస్‌కు అండగా నిలిచారని ఆయన స్పష్టం చేశారు.
కొత్తగూడెం నియోజకవర్గంలోని చుంచుపల్లి మండలం విద్యానగర్‌లోని మంత్రి క్యాంపు కార్యాలయంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని ఐదు నియోజకవర్గాలకు చెందిన నూతన సర్పంచులు, ఉప సర్పంచులు, వార్డు సభ్యుల అభినందన సభ గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గెలుపొందిన 400 మందికి పైగా సర్పంచులను, వేలాది మంది వార్డు సభ్యులను మంత్రి శాలువాలతో సత్కరించారు.

ప్రతిపక్షాల అంకెల గారడీ
పంచాయతీ ఎన్నికల ఫలితాలను తట్టుకోలేక ప్రతిపక్షాలు తప్పుడు ప్రచారాలకు దిగుతున్నాయని మంత్రి మండిపడ్డారు. గులాబీ పార్టీ పత్రికల్లో అంకెల గారడీ చేస్తూ ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తోందని విమర్శించారు. కానీ గ్రామీణ ప్రజల నిజమైన తీర్పు కాంగ్రెస్ వైపే ఉందని, రాబోయే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లోనూ ఇదే ఫలితం పునరావృతమవుతుందని ధీమా వ్యక్తం చేశారు.
ఏ పార్టీ బలంగా నిలవాలన్నా గ్రామ స్థాయి కార్యకర్తలే పునాదని పొంగులేటి కొనియాడారు. గత పాలనలో కుట్రలు, అప్రజాస్వామిక విధానాలు కొనసాగాయని, తమ ప్రభుత్వం మాత్రం రాజ్యాంగబద్ధంగా ఎన్నికలు నిర్వహించి గ్రామ నాయకత్వాన్ని బలోపేతం చేసిందన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 70 శాతానికి పైగా పంచాయతీల్లో మూడు రంగుల జెండా ఎగరడం కార్యకర్తల అంకితభావానికి నిదర్శనమన్నారు.
హామీల అమలుకు కట్టుబాటు
రాష్ట్ర ఆర్థిక పరిస్థితి సవాలుగా ఉన్నప్పటికీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఇచ్చిన ప్రతి హామీని అమలు చేస్తామని మంత్రి పునరుద్ఘాటించారు. కొత్తగూడెం నియోజకవర్గంలో మిత్రపక్షం ఎమ్మెల్యే ఉన్నా కాంగ్రెస్ కార్యకర్తలు నిరాశ చెందాల్సిన అవసరం లేదని, ప్రతి కార్యకర్తకు తాను అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ అధ్యక్షురాలు తోట దేవి ప్రసన్న, ఎమ్మెల్యేలు డా.తెల్లం వెంకట్రావ్ (భద్రాచలం), పాయం వెంకటేశ్వర్లు (పినపాక), కోరం కనకయ్య (ఇల్లందు), ఆదినారాయణ (అశ్వారావుపేట), రాంరెడ్డి గోపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.


