ప్రశాంతంగా ముగిసిన పంచాయతీ ఎన్నికలు
ఖమ్మం జిల్లాలో మూడు విడతల పోలింగ్ సజావు
566 జీపీల్లో అవాంఛనీయ ఘటనల్లేకుండా ఎన్నికలు
ఎన్నికల సిబ్బందికి కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి అభినందనలు
కాకతీయ, ఖమ్మం : ఖమ్మం జిల్లా పరిధిలో మూడు విడతల్లో నిర్వహించిన గ్రామ పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా, సజావుగా ముగిశాయని జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి వెల్లడించారు. ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా అధికారులు, సిబ్బంది సమన్వయంతో ఎన్నికల ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేసినట్లు తెలిపారు. జిల్లా వ్యాప్తంగా మొత్తం 566 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించామని కలెక్టర్ పేర్కొన్నారు. 566 సర్పంచ్ పదవులు, 566 ఉప సర్పంచ్ పదవులు, 5168 వార్డు సభ్యుల స్థానాలకు సంబంధించి పోలింగ్ పూర్తయిందని వివరించారు. అన్ని చోట్ల ఎన్నికల ప్రక్రియ ప్రశాంత వాతావరణంలో కొనసాగిందన్నారు. ఎన్నికల ప్రకటన నాటి నుంచే ముందస్తు ప్రణాళికతో అధికారులు చర్యలు తీసుకున్నారని కలెక్టర్ తెలిపారు. పోలింగ్ కేంద్రాల వద్ద భద్రతా ఏర్పాట్లు, లాజిస్టిక్ సపోర్ట్ సమర్థవంతంగా నిర్వహించడం వల్ల ఎలాంటి సమస్యలు తలెత్తలేదన్నారు.
సిబ్బందికి ప్రత్యేక అభినందనలు
ఎన్నికల విధుల్లో పాల్గొన్న అధికారులు, సిబ్బంది అందరూ పూర్తి స్థాయి చిత్తశుద్ధితో పనిచేశారని ప్రశంసించారు. ఎక్కడా చిన్నపాటి పొరపాట్లకు కూడా తావు లేకుండా ఎన్నికలను కట్టుదిట్టంగా నిర్వహించిన ప్రతి ఒక్కరికీ జిల్లా యంత్రాంగం తరఫున ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నట్లు కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి ఆ ప్రకటనలో పేర్కొన్నారు.


