పాలిటెక్నిక్ కళాశాలలో జిల్లా స్థాయి క్రీడా పోటీలు
ఈనెల 19, 20న నిర్వహణ..
కళాశాల ప్రిన్సిపల్ బండి శ్రీనివాస్ పిలుపు
కాకతీయ, కొత్తగూడెం : కొత్తగూడెం ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ఆధ్వర్యంలో ఈనెల 19, 20 తేదీలలో జిల్లా స్థాయి ఇంటర్ పాలిటెక్నిక్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ పోటీలు నిర్వహించనున్నట్లు కళాశాల ప్రిన్సిపల్ బండి శ్రీనివాస్ తెలిపారు. ఈ మేరకు గురువారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. ఈ క్రీడా పోటీలలో జిల్లా పరిధిలోని ప్రభుత్వ, ప్రైవేట్ పాలిటెక్నిక్ కళాశాలలకు చెందిన విద్యార్థులు పాల్గొంటారని తెలిపారు. మొత్తం 8 పాలిటెక్నిక్ కళాశాలల విద్యార్థులు ఈ పోటీల్లో తమ క్రీడా నైపుణ్యాలను ప్రదర్శించనున్నారని పేర్కొన్నారు. ఈ పోటీల ద్వారా విద్యార్థుల్లో శారీరక దృఢత్వం, క్రమశిక్షణ, స్నేహభావం, ఆరోగ్యకరమైన పోటీ తత్వం పెంపొందుతుందని ప్రిన్సిపల్ తెలిపారు. చదువుతో పాటు క్రీడల్లో కూడా రాణిస్తేనే సమగ్ర అభివృద్ధి సాధ్యమవుతుందని అన్నారు. మొదటి రోజు పోటీలు ఉదయం 9.30 గంటలకు ముఖ్య అతిథులచే ప్రారంభమవుతాయని తెలిపారు. రెండు రోజుల పాటు వివిధ జట్టు క్రీడలు, వ్యక్తిగత క్రీడా ఈవెంట్లు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. పోటీల్లో విజేతలుగా నిలిచిన విద్యార్థులకు ముగింపు కార్యక్రమంలో విశిష్ట అతిథుల చేతుల మీదుగా బహుమతులు, ప్రశంసా పత్రాలు అందజేస్తామని తెలిపారు. జిల్లా స్థాయి క్రీడా పోటీలను విద్యార్థులు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని ప్రిన్సిపల్ బండి శ్రీనివాస్ పిలుపునిచ్చారు.


