రాహుల్, సోనియాలపై బీజేపీ కక్షసాధింపు
ఈడీని అడ్డుపెట్టుకొని వేధింపులు
ఖమ్మం జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు నూతి సత్యనారాయణ గౌడ్
ఖమ్మం పట్టణంలో భారీ నిరసన ప్రదర్శన
కాకతీయ, ఖమ్మం ప్రతినిధి : కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)ని అడ్డుపెట్టుకొని కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీలపై కక్షసాధింపు చర్యలకు పాల్పడుతోందని జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు నూతి సత్యనారాయణ గౌడ్ ఆరోపించారు. కాంగ్రెస్ నేతలపై జరుగుతున్న వేధింపులను నిరసిస్తూ ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ పిలుపు మేరకు, టీపీసీసీ ఆదేశాల ప్రకారం జిల్లా కాంగ్రెస్ కమిటీ, నగర కాంగ్రెస్ కమిటీల ఆధ్వర్యంలో గురువారం ఖమ్మంలో భారీ నిరసన కార్యక్రమం నిర్వహించారు. జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు నూతి సత్యనారాయణ గౌడ్, నగర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు నాగండ్ల దీపక్ చౌదరి నాయకత్వంలో కాంగ్రెస్ శ్రేణులు పెద్ద ఎత్తున తరలివచ్చి అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా నూతి సత్యనారాయణ గౌడ్ మాట్లాడారు.
కాంగ్రెస్ అగ్రనేతలపై బీజేపీ కక్ష సాధింపు
కొన్ని సంవత్సరాలుగా ఈడీని రాజకీయ ఆయుధంగా మార్చి కాంగ్రెస్ అగ్రనేతలపై అక్రమ కేసులు బనాయిస్తూ బీజేపీ రాక్షసానందం పొందుతోందని నూతి సత్యనారాయణ గౌడ్ అన్నారు. డిల్లీ హైకోర్టు తీర్పు బీజేపీకి చెంపపెట్టులాంటిదని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ అగ్రనేతలను రాజకీయంగా దెబ్బతీయాలనే దురుద్దేశంతో బీజేపీ వేసిన కేసులను డిల్లీ హైకోర్టు రాజకీయ ప్రేరేపిత కేసులుగా గుర్తించి ఈడీ దాఖలు చేసిన చార్జిషీట్‌ను తిరస్కరించిందన్నారు. దేశం కోసం ప్రాణాలు అర్పించిన కుటుంబానికి చెందిన నాయకులపై ఇలాంటి కుట్రలు చేయడం హేయమైన చర్య అని మండిపడ్డారు. యావత్తు దేశ ప్రజలు బీజేపీ అరాచకాలను గమనిస్తున్నారని, తగిన సమయంలో ప్రజలే సరైన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. రాజ్యాంగబద్ధ సంస్థలను స్వప్రయోజనాల కోసం బీజేపీ దుర్వినియోగం చేస్తోందని విమర్శించారు. రెండు దఫాలుగా అధికారంలో ఉన్న బీజేపీ పాలనలో దేశంలో అభివృద్ధి, సంక్షేమం శూన్యమని, తమ ఆప్తుల ఆస్తులు కాపాడుకోవడమే ప్రభుత్వ లక్ష్యంగా మారిందని ఆరోపించారు. నిరసన అనంతరం కాంగ్రెస్ శ్రేణులను 2టౌన్ పోలీస్ స్టేషన్‌కు తరలించగా, స్వంత పూచీకత్తుపై విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో సీనియర్ కాంగ్రెస్ నాయకులు పులిపాటి వెంకయ్య, రాష్ట్ర ఓబీసీ సెల్ ఉపాధ్యక్షుడు వడ్డేబోయిన నరసింహారావు, జిల్లా అనుబంధ సంఘాల అధ్యక్షులు దొబ్బల సౌజన్య, సయ్యద్ గౌస్, మొక్కా శేఖర్ గౌడ్, బొడ్డు బొందయ్య, కార్పొరేటర్లు రాపర్తి శరత్, మాజి కౌన్సిలర్ పాలకుర్తి నాగేశ్వరరావు, కాపా ఆదినారాయణ, శెట్టి రంగారావు, వైరా మార్కెట్ కమిటీ చైర్మన్ బోళ్ల గంగారావు, నరాల నరేష్ నాయుడు, గజ్జి సూర్యనారాయణతో పాటు పలువురు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.


