ప్రజల గుండెల్లోనే కేసీఆర్
గులాబీ జెండా అభిమానం పదిలం
మాజీ ఎంపీ నామా నాగేశ్వరరావు
కాకతీయ, ఖమ్మం ప్రతినిధి : తెలంగాణ ప్రజల గుండెల్లో కేసీఆర్, గులాబీ జెండా పదిలంగా ఉన్నాయన్న విషయం ఇటీవల జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల ఫలితాలతో మరోసారి రుజువైందని బీఆర్ఎస్ మాజీ లోక్‌సభ పక్ష నేత, ఖమ్మం మాజీ ఎంపీ నామ నాగేశ్వరరావు పేర్కొన్నారు. మూడు విడతల్లో నిర్వహించిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో బీఆర్ఎస్ మద్దతుతో గెలుపొందిన సర్పంచ్‌లు, ఉప సర్పంచ్‌లు, వార్డు సభ్యులకు ఆయన అభినందనలు తెలిపారు. రానున్న ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో కూడా ఇదే ఐక్యత, ఇదే ఉత్సాహంతో పని చేస్తే ఘన విజయం సాధ్యమని విశ్వాసం వ్యక్తం చేశారు.
పార్టీ నాయకులు, కార్యకర్తలు ప్రజల మధ్యే ఉండి వారి సమస్యలను తెలుసుకుని పరిష్కారానికి కృషి చేయాలని సూచించారు. గ్రామ ప్రజలు మళ్లీ కేసీఆర్ నాయకత్వాన్ని కోరుకుంటున్నారని, బీఆర్ఎస్ పాలనను మరోసారి చూడాలనే ఆకాంక్ష ప్రజల్లో స్పష్టంగా కనిపిస్తోందన్నారు. అధికార పార్టీ ఆగడాలు, ఒత్తిళ్లు, బెదిరింపులు ఎదురైనా బీఆర్ఎస్ మద్దతుతో పోటీ చేసి గెలుపొందిన ప్రజాప్రతినిధుల విజయం అధికార పార్టీకి చెంపపెట్టులాంటిదని వ్యాఖ్యానించారు. ప్రజాస్వామ్య విలువలను కాపాడేందుకు గ్రామీణ స్థాయిలో బీఆర్ఎస్ శ్రేణులు చేసిన పోరాటం ప్రశంసనీయమన్నారు. ఎన్నికల్లో గెలుపోటములు సహజమని, గెలిచినా ఓడినా గ్రామాల అభివృద్ధిలో భాగస్వాములుగా నిలవాలని సూచించారు. గ్రామ పాలనలో సర్పంచ్‌లు, ఉప సర్పంచ్‌లు, వార్డు సభ్యుల పాత్ర అత్యంత కీలకమని తెలిపారు. ప్రజల నమ్మకాన్ని గెలిచిన ప్రజాప్రతినిధులు ఆ నమ్మకాన్ని మరింత బలపరిచే విధంగా పని చేయాలన్నారు.
బీఆర్ఎస్ పాలనలో గ్రామాల్లో విస్తృత అభివృద్ధి జరిగిందని, అనేక సంక్షేమ కార్యక్రమాల అమలుతో గ్రామాల రూపురేఖలు మారాయని గుర్తుచేశారు. అదే అభివృద్ధి దిశను కొనసాగించాల్సిన బాధ్యత ఇప్పుడెన్నికైన ప్రజాప్రతినిధులపై ఉందని నామ నాగేశ్వరరావు స్పష్టం చేశారు.


