మున్నేరుపై చెప్టా రోడ్డును పూర్తి చేయాలి
సీపీఎం ఖమ్మం డివిజన్ కార్యదర్శి వై. విక్రమ్
కాకతీయ, ఖమ్మం: కాలువొడ్డు మున్నేరు మీదుగా నిర్మిస్తున్న చెప్టా రోడ్డును తక్షణమే పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని సీపీఎం ఖమ్మం డివిజన్ కమిటీ డిమాండ్ చేసింది. ఈ మేరకు గురువారం ఆర్ అండ్ బి అధికారులకు వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా సీపీఎం ఖమ్మం డివిజన్ కార్యదర్శి వై. విక్రమ్ మాట్లాడుతూ, ఖమ్మం నగరానికి అత్యంత కీలకమైన రహదారిగా కాలువొడ్డు మున్నేరు పాత బ్రిడ్జి ఉండేదని తెలిపారు. నూతన బ్రిడ్జిని ‘తీగల వంతెన’ పేరుతో సంవత్సరాల తరబడి నిర్మాణం కొనసాగుతుండటంతో ట్రాఫిక్ సమస్యలు తీవ్రంగా మారాయని అన్నారు. పాత బ్రిడ్జిపై రాకపోకలను నిలిపివేయడంతో ద్విచక్ర, నాలుగు చక్రాల వాహనదారులు, ఆటో డ్రైవర్లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజలు ఖమ్మం నగరానికి రావాలంటే కరుణగిరి బ్రిడ్జి మీదుగా చుట్టూ తిరిగి రావాల్సిన పరిస్థితి ఏర్పడిందని తెలిపారు. ఈ సమస్యకు పరిష్కారంగా కాలువొడ్డు మున్నేరుపై చెప్టా రోడ్డును వెంటనే పూర్తి చేస్తే వాహనదారులకు ఉపశమనం లభిస్తుందని అన్నారు. ప్రస్తుతం మున్నేరు వరద తగ్గిన నేపథ్యంలో పనులను వేగవంతం చేసి చెప్టా రోడ్డును ప్రజలకు అందుబాటులోకి తేవాలని డిమాండ్ చేశారు. ఈ పనులపై ఆర్ అండ్ బి అధికారులు, మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్, మేయర్ తక్షణమే దృష్టి సారించాలని కోరారు. సమస్యను పరిష్కరించకపోతే ఆందోళన కార్యక్రమాలు చేపడతామని సీపీఎం స్పష్టం చేసింది. ఈ కార్యక్రమంలో సీపీఎం ఖమ్మం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు యర్రా శ్రీనివాసరావు, ఖమ్మం త్రీ టౌన్ కార్యదర్శి భూక్యా శ్రీనివాసరావు, నాయకులు ఎస్.కే. నాగులు మీరా, షేక్ హిమామ్, మెహిరెన్నసా బేగం తదితరులు పాల్గొన్నారు.


