- సమస్యాత్మక కేంద్రాల తనిఖీ
కొత్తగూడెం, కాకతీయ: భద్రాద్రి జిల్లాలో బుధవారం జరిగిన మూడో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను జిల్లా ఎస్పీ రోహిత్ రాజు సందర్శించి అక్కడి పరిస్థితులను పరిశీలించారు. జిల్లాలో పంచాయతీ ఎన్నికల మూడో విడత పోలింగ్లో భాగంగా జూలూరుపాడు మండలం పాపకొల్లు, సుజాతనగర్ మండలం సర్వారం, లక్ష్మీదేవిపల్లి మండలం చాతకొండ, టేకులపల్లి, దాసుతండా పోలింగ్ కేంద్రాలను ఆయన తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పోలింగ్ కేంద్రాల్లో విధుల్లో ఉన్న ఎన్నికల అధికారులు, పోలీస్ అధికారులు, సిబ్బందికి ఎస్పీ పలు సూచనలు చేశారు. పోలింగ్ ప్రక్రియ సజావుగా సాగేలా అధికారులు అప్రమత్తంగా విధులు నిర్వహించాలని ఆదేశించారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించే వారిపై ఎన్నికల నియమావళి ఉల్లంఘన కింద కేసులు నమోదు చేసి కఠినంగా వ్యవహరించాలని సూచించారు. ఏవైనా సమస్యలు తలెత్తితే వెంటనే తన దృష్టికి తీసుకురావాలని తెలిపారు. కౌంటింగ్ ప్రక్రియ ముగిసే వరకు అధికారులు పూర్తి బాధ్యతతో విధులు నిర్వర్తించాలని ఎస్పీ రోహిత్ రాజు ఆదేశించారు.


