- గూడెంలో రెండు పార్టీల మధ్య ముదురుతున్న అంతర్గత పోరు
- చుంచుపల్లి మండలంలో సర్పంచ్‌కు కోటి రూపాయల ఆఫర్
కాకతీయ, కొత్తగూడెం ప్రతినిధి: మూడో విడత గ్రామ పంచాయతీ ఎన్నికలు జరుగుతున్న వేళ రాజకీయాలు ఆసక్తికర మలుపులు తిరుగుతున్నాయి. తమ అభ్యర్థులను గెలిపించుకునేందుకు అన్ని పార్టీలు వ్యూహాలు రచిస్తుండగా, గత రెండు విడతల్లో గెలిచిన కొందరు సర్పంచులు మాత్రం పార్టీ మారేందుకు సిద్ధమవుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. చుంచుపల్లి మండలంలో ఒక పార్టీ మద్దతుతో సుమారు రూ.50 లక్షలు ఖర్చు చేసి సర్పంచ్‌గా గెలిచిన ఓ అభ్యర్థికి తాజాగా భారీ ఆఫర్ వచ్చినట్లు సమాచారం. ‘నీ పదవి నీకే ఉంటుంది… పార్టీ మారితే కోటి రూపాయలు ఇస్తాం’ అంటూ ఓ కీలక నేత ఆఫర్ చేసినట్లు స్థానికంగా చర్చ జరుగుతోంది. అంతేకాదు, వారి కుటుంబ సభ్యుల్లో ఒకరికి యూనియన్‌లో జిల్లా స్థాయి పదవి ఇప్పిస్తామన్న హామీ కూడా ఇచ్చినట్లు ప్రచారం సాగుతోంది.
ముదురుతున్న అంతర్గత కుమ్ములాట
గూడెం ప్రాంతంలో ఇప్పటివరకు పైపైకి దోస్తులుగా ఉన్న రెండు పార్టీల మధ్య పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో అంతర్గత పోరు తెరపైకి వచ్చింది. ‘మా పార్టీ అభ్యర్థే గెలవాలి’ అన్న పట్టుదలతో నాయకులు వర్గాలుగా చీలిపోయి రాజకీయ సమరానికి దిగినట్లు తెలుస్తోంది. బయటకు పొత్తులు ఉన్నట్లు కనిపించినా, లోపల మాత్రం నువ్వా నేనా అన్న స్థాయిలో పోటీ కొనసాగుతోంది.
అభ్యర్థులకు ‘కనకవర్షం’
చుంచుపల్లి మండలంలో పార్టీ మారే యోచనలో ఉన్న అభ్యర్థి పంచాయతీ ఎన్నికల సమయంలో ఇప్పటికే అనేక మందికి సుమారు రూ.50 లక్షల వరకు ఖర్చు చేసినట్లు ప్రచారం జరుగుతోంది. ఇదే సమయంలో పార్టీల మధ్య అంతర్గత కుమ్ములాట కారణంగా అభ్యర్థులకు కనకవర్షం కురుస్తున్న పరిస్థితి నెలకొంది. ఇదిలా ఉండగా, తాము గెలిచిన పార్టీలో మండల అధ్యక్షుడు ఏకచక్రాధిపత్యం ప్రదర్శిస్తున్నారని, పార్టీలో కొనసాగితే ఆయన చేతిలో కీలుబొమ్మలుగా మారాల్సి వస్తుందన్న ఆందోళనతోనే పార్టీ మారే ఆలోచన చేస్తున్నట్లు ఆ సర్పంచ్ వర్గం నుంచి బలమైన ప్రచారం వినిపిస్తోంది.


