చతుర్ముఖ లింగం, నంది విగ్రహాన్ని పరిరక్షించాలి
దేవదాయ శాఖ మంత్రి కొండా సురేఖకు వినతి
కాకతీయ, ఖిలా వరంగల్ : ఖిలా వరంగల్ మధ్యకోటలో ఉన్న స్వయంభు శ్రీ శంభు లింగేశ్వర స్వామి దేవాలయ ప్రాంగణంలో భూమిలో సగభాగం కూరుకుపోయిన చారిత్రక చతుర్ముఖ లింగం, భారీ నంది విగ్రహాన్ని వెలికి తీసి పరిరక్షించాలని చారిత్రక కట్టడాల పరిరక్షణ కమిటీ ప్రతినిధులు ప్రభుత్వాన్ని కోరారు. దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందిన ఈ స్వయంభు దేవాలయంలో ప్రస్తుతం గ్రానైట్‌తో అభివృద్ధి పనులు కొనసాగుతున్న నేపథ్యంలో, ఆలయానికి ఉన్న చారిత్రక-ఆధ్యాత్మిక వైభవాన్ని కాపాడాల్సిన అవసరం ఉందని కమిటీ సభ్యులు పేర్కొన్నారు. భూమిలో నిక్షిప్తమై ఉన్న పురాతన చతుర్ముఖ లింగం, నంది విగ్రహం భాగాలను గుర్తించి, శాస్త్రోక్తంగా వెలికి తీసి పునఃప్రతిష్ఠ చేయాలని వారు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు రాష్ట్ర దేవదాయ శాఖ మంత్రి కొండా సురేఖను కలిసి వినతిపత్రం అందజేశారు. ఆలయ చరిత్రకు నిదర్శనమైన ఈ విగ్రహాల పరిరక్షణకు ప్రభుత్వం తక్షణమే చర్యలు చేపట్టాలని వారు కోరారు. కార్యక్రమంలో చారిత్రక కట్టడాల పరిరక్షణ కమిటీ సభ్యులు చెన్నూరి దేవేందర్, జూలూరు గౌతమ్, అచ్చ వినోద్, బొల్లం భరత్, గండి నాగరాజు, కలవచర్ల వంశీ, గండ్రతి నవీన్ తదితరులు పాల్గొన్నారు.


