ఏఐ పోటీల్లో ఖమ్మం కుర్రాడి సత్తా
గూగుల్ వరల్డ్‌వైడ్ కాంపిటీషన్‌లో రెండో బహుమతి
రూ.6.50 లక్షల ప్రైజ్ సాధించిన కార్తీక్ రెడ్డి
కాకతీయ, ఖమ్మం : ఖమ్మం జిల్లా యువకుడు అంతర్జాతీయ స్థాయిలో తన ప్రతిభను చాటాడు. గూగుల్ సంస్థ ప్రపంచవ్యాప్తంగా నిర్వహించిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) కాంపిటీషన్‌లో ఖమ్మానికి చెందిన వేమిరెడ్డి కార్తీక్ రెడ్డి రెండో బహుమతి సాధించి రూ.6,50,000 నగదు ప్రైజ్ గెలుచుకున్నారు. లక్షలాది మంది పాల్గొన్న ఈ వరల్డ్‌వైడ్ పోటీలో సెకండ్ విన్నర్‌గా నిలవడం విశేషం. కార్తీక్ రెడ్డి ఇంటర్ వరకు ఖమ్మంలో విద్యాభ్యాసం చేసి, అనంతరం త్రిబుల్ ఐటీ లో బీటెక్ పూర్తి చేశారు. క్యాంపస్ ప్లేస్‌మెంట్‌లోనే రూ.18 లక్షల ప్యాకేజ్‌తో ఉద్యోగం సాధించి, ఒక సంవత్సరం పాటు పని చేశారు. అనంతరం ఉన్నత చదువుల కోసం అమెరికాలోని ఫ్లోరిడా స్టేట్ యూనివర్సిటీలో ఎంఎస్ పూర్తి చేశారు.
ప్రస్తుతం వరల్డ్ వైడ్ క్యాన్సర్ రీసెర్చ్ టీమ్‌లో సభ్యుడిగా పనిచేస్తున్న కార్తీక్ రెడ్డి, అదే సమయంలో వరల్డ్ వైడ్ కోడింగ్ కాంపిటీషన్లలో పాల్గొంటూ విశేష ప్రతిభ కనబరుస్తున్నారు. గూగుల్ నిర్వహించిన ఏఐ కాంపిటీషన్‌లో ఆయన ప్రతిపాదించిన సాంకేతిక పరిష్కారానికి అంతర్జాతీయ న్యాయనిర్ణేతలు ప్రశంసలు కురిపించారు. కార్తీక్ రెడ్డి తండ్రి వేమిరెడ్డి భాస్కర్ రెడ్డి ఏన్కూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో హెల్త్ అసిస్టెంట్‌గా విధులు నిర్వహిస్తున్నారు. కుమారుడి విజయం పట్ల కుటుంబ సభ్యులు, మిత్రులు, ఉపాధ్యాయులు ఆనందం వ్యక్తం చేస్తూ అభినందనలు తెలిపారు.


