ఖమ్మంలో పరిశ్రమల విస్తరణకు చర్యలు
కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి
టీజీఐఐసీ భూములను క్షేత్రస్థాయిలో పరిశీలన
కాకతీయ, ఖమ్మం ప్రతినిధి : ఖమ్మం జిల్లాలో చిన్న, మధ్య తరహా పరిశ్రమలను ప్రోత్సహించేందుకు ప్రత్యేక కార్యాచరణ చేపట్టినట్లు జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి తెలిపారు. మంగళవారం రఘునాథపాలెం మండలం జింకల తండా, పువ్వాడ నగర్ పరిధిలో తెలంగాణ రాష్ట్ర పరిశ్రమల మౌళిక వసతుల అభివృద్ధి సంస్థ (టిజిఐఐసి)కు కేటాయించిన భూములను ఆయన క్షేత్రస్థాయిలో పరిశీలించారు. పరిశ్రమల స్థాపనకు భూమి అనుకూలత, రహదారి అనుసంధానం, మౌళిక వసతుల లభ్యత వంటి అంశాలను సంబంధిత అధికారులతో కలిసి కలెక్టర్ పరిశీలించారు. కేటాయించిన భూమి విస్తీర్ణం, సరిహద్దులు, ప్రస్తుత పరిస్థితులపై సమగ్రంగా చర్చించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. సేత్వార్, కాస్రా, నక్షా మ్యాప్‌లను ఆధారంగా తీసుకుని మొత్తం స్థలాన్ని సమగ్రంగా సర్వే చేసి స్పష్టమైన సరిహద్దులు కేటాయించాలని అధికారులను ఆదేశించారు. టిజిఐఐసి ద్వారా కేటాయించిన భూములను సమర్థవంతంగా వినియోగించి జిల్లాలో ఆర్థికాభివృద్ధికి బాటలు వేయాలని సూచించారు. ఖమ్మం జిల్లాను పరిశ్రమలకు అనుకూల కేంద్రంగా తీర్చిదిద్దే దిశగా జిల్లా యంత్రాంగం నిరంతరం కృషి చేస్తోందని, పరిశ్రమల విస్తరణతో ఉపాధి అవకాశాలు పెరుగుతాయని కలెక్టర్ పేర్కొన్నారు. కార్యక్రమంలో మైనింగ్ ఎడీ సాయినాథ్, పరిశ్రమల శాఖ జీఎం సీతారాం నాయక్, ఖమ్మం ఆర్డీవో నరసింహారావు, రఘునాథపాలెం మండల తహసీల్దార్ శ్వేత, సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.


