కాకతీయ, సంగారెడ్డి : సంగారెడ్డి జిల్లా అమీన్‌పూర్‌లో పంద్రాగస్టు సందర్భంగా కృష్ణదేవరాయ కాపు సంఘం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సీ.కే.నాయుడు స్మారక బాడ్మింటన్ టోర్నమెంట్స్‌ను బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ డిప్యూటీ లీడర్, రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. క్రీడలకు దేశంలో తగిన ప్రాధాన్యం ఇవ్వకపోవడంతో ఒలింపిక్స్, అంతర్జాతీయ వేదికలపై పతకాల సంఖ్య తక్కువగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు.
కేంద్ర ప్రభుత్వం 55 లక్షల కోట్ల బడ్జెట్‌లో క్రీడలకు కేవలం 2161 కోట్లు, తెలంగాణకు 17 కోట్లు మాత్రమే కేటాయించడమే దీనికి నిదర్శనమని విమర్శించారు. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు క్రీడలకు విశేష ప్రోత్సాహం అందించారని, గోపీచంద్, గుత్తా జ్వాల, పీ.వి.సింధు వంటి క్రీడాకారులు అకాడమీలు స్థాపించారని, నిఖత్ జరీన్, సిరాజుద్దీన్, సానియా మీర్జా, సైనా నెహ్వాల్, సాత్విక్ తదితరులు అంతర్జాతీయ పతకాలు సాధించారని గుర్తుచేశారు.
స్కైలైన్ అకాడమీ (రంకిరెడ్డి విశ్వనాథం క్రీడా ప్రాంగణం)లో జరిగిన ఈ కార్యక్రమంలో మున్నూరుకాపు ప్రముఖులు గాలి అనిల్, తూడి ప్రవీణ్, నిర్వాహకులు సత్యనారాయణ, విష్ణుమూర్తి, సత్తి అప్పారావు తదితరులు పాల్గొన్నారు. అనంతరం ఎంపీ వద్దిరాజు, ప్రముఖులకు శాలువాలు కప్పి సత్కరించారు. క్రీడల వల్ల శారీరక దృఢత్వం, మానసిక ఉల్లాసం పెరుగుతుందని, చదువుతో పాటు క్రీడల్లో ప్రతిరోజూ సాధన చేస్తే భవిష్యత్తు వెలుగులు నింపుతుందని ఎంపీ రవిచంద్ర యువతకు పిలుపునిచ్చారు.


