వైభవోపేతంగా అయ్యప్ప స్వామి పడిపూజ
వెల్లి విరిసిన భక్తి సామరస్యం
కాకతీయ,ఖమ్మం : స్వామియే శరణమయ్యప్ప… స్వామి శరణం.. అయ్యప్ప శరణం.. అంటూ అయ్యప్ప స్వాముల శరణు ఘోషతో చైతన్య నగర్ ప్రాంతమంతా భక్తి పారవశ్యంతో మారుమోగింది. ఖమ్మంలోని బైపాస్ రోడ్డులో ఉన్న చైతన్య నగర్ శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి ఆలయానికి హుండాయ్ షోరూం యాజమాన్యం పదునెట్టెంబడి పంచ లోహాలతో కేరళ శిల్పులతో తయారు చేయించిన సుమారు రూ. 8.50 లక్షల విలువ చేసే వెండి తొడుగును ఆలయం చైర్మన్ మేకల హనుమంతరావు సమక్షంలో ఆలయానికి అంకితమిచ్చారు. తొలి పడిపూజను గురు స్వామి దేవ భక్తని కిషోర్ బాబు – విజయ దంపతుల ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా నిర్వహించారు. స్వాముల భక్తి పాటలు, శరణు ఘోషల నడుమ ఆ ప్రాంతమంతా భక్తి సామరస్యంతో వెళ్లి విరిసింది. అనంతరం ఆలయంలో గణపతి హోమం, గుడిసేవ, అభిషేకం, సాయంత్రం పుష్పాభిషేకం, కనకాభిషేకం చేశారు. మధ్యాహ్నం సుమారు 600 మంది స్వాములకు అన్నదానం నిర్వహించారు. కార్యక్రమంలో గురు స్వాములు అట్లూరి మధు, పుల్లం రాజు , సరిపుడి నాగేశ్వరరావు, ఆలస్యం నారాయణరావు, జంగా నవీన్, వేల్పుల రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు.


