63 క్రిటికల్ పోలింగ్ కేంద్రాలకు అదనపు భద్రత
మూడో విడత ఎన్నికలకు కట్టుదిట్టమైన పోలీస్ బందోబస్తు
విజయోత్సవ ర్యాలీలకు అనుమతి లేదు: పోలీస్ కమిషనర్ సునీల్ దత్
కాకతీయ, ఖమ్మం ప్రతినిధి : మూడో విడత గ్రామ పంచాయతీ ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు పటిష్ఠమైన భద్రతా ఏర్పాట్లు చేపట్టినట్లు పోలీస్ కమిషనర్ సునీల్ దత్ తెలిపారు. జిల్లాలోని 63 క్రిటికల్ పోలింగ్ కేంద్రాలను గుర్తించి అక్కడ అదనపు పోలీసు బలగాలను మోహరించినట్లు వెల్లడించారు. పోలింగ్ నుంచి ఓట్ల లెక్కింపు వరకు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చర్యలు తీసుకుంటున్నామని, సమస్యాత్మక గ్రామాలపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసినట్లు తెలిపారు. మద్యం, నగదు, కానుకల పంపిణీని అడ్డుకునేందుకు ప్రత్యేక బృందాలు నిరంతరం పర్యవేక్షణ చేపడుతున్నాయని చెప్పారు.
భారీ బలగాలతో బందోబస్తు..
ఆరు మండలాల పరిధిలో 8 మంది ఏసీపీలు, 20 మంది సీఐలు, 87 మంది ఎస్సైలు,
1700 మంది పోలీస్ సిబ్బందికి బందోబస్తు విధులు కేటాయించినట్లు పోలీస్ కమిషనర్ తెలిపారు.
పోలింగ్ కేంద్రాల వద్ద ప్రత్యేక పహారా, నిఘా బృందాలతో పాటు 3 స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్స్,
78 రూట్ మొబైల్ పార్టీలు, 15 ఎఫ్‌ఎస్‌టీ బృందాలు,30 ఎస్‌ఎస్‌టీ బృందాలు విధుల్లో పాల్గొంటున్నాయని వివరించారు.
సమస్యాత్మక గ్రామాల్లో ఫ్లాగ్ మార్చ్
సున్నిత గ్రామాల్లో పోలీస్ బృందాలతో పికెటింగ్, ఫ్లాగ్ మార్చ్ నిర్వహించామని, ఎన్నికలకు విఘాతం కలిగించే అవకాశమున్న వారిని ముందస్తుగా బైండోవర్ చేసినట్లు తెలిపారు. ఎవరైనా శాంతిభద్రతలకు భంగం కలిగిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. సెక్షన్ 163 బీఎన్‌ఎస్‌ఎస్ అమలులో ఉన్న నేపథ్యంలో విజయోత్సవ ర్యాలీలు, బాణసంచా, డీజే కార్యక్రమాలకు ఎలాంటి అనుమతి లేదని స్పష్టం చేశారు. ఓట్ల లెక్కింపు కేంద్రానికి 100 మీటర్ల పరిధిలో ఎవరూ ఉండరాదని ఆదేశించారు. ఎన్నికల నిర్వహణకు అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లతో సిద్ధంగా ఉందని, ఓటర్లు నిర్భయంగా, స్వేచ్ఛగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని పోలీస్ కమిషనర్ సునీల్ దత్ విజ్ఞప్తి చేశారు.


