అదుపుతప్పిప లోయవైపు దూసుకెళ్లిన టూరిస్టు బస్సు
శ్రీశైలం వెళ్తున్న ఘటన… దోర్నాల ఫారెస్ట్ చెక్‌పోస్ట్ వద్ద ప్రమాదం
కాకతీయ, ప్రకాశం : ప్రకాశం జిల్లా దోర్నాల ఫారెస్ట్ చెక్‌పోస్ట్‌కు కూతవేటు దూరంలో శనివారం శ్రీశైలం వెళ్తున్న టూరిస్ట్ బస్సు అదుపుతప్పి రోడ్డు డివైడర్ మధ్యలో దూసుకెళ్లింది. ఈ ఘటనతో క్షణకాలం ఉద్రిక్తత నెలకొనగా, అదృష్టవశాత్తు ఎటువంటి ప్రాణనష్టం జరగలేదు. బస్సులో పలువురు ప్రయాణికులు ఉండటంతో ప్రమాదం చోటుచేసుకుంటే తీవ్ర పరిణామాలు ఎదురయ్యే పరిస్థితి ఏర్పడింది. అయితే డ్రైవర్ అప్రమత్తతతో పెనుప్రమాదం తప్పినట్లు స్థానికులు తెలిపారు. ప్రమాదం జరిగిన వెంటనే రోడ్డుపై ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. సమాచారం అందుకున్న దోర్నాల పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని ట్రాఫిక్ నిలిచిపోకుండా చర్యలు చేపట్టారు. బస్సును రోడ్డుపై నుంచి తొలగించి వాహనాల రాకపోకలను సజావుగా కొనసాగించారు. ఈ ఘటనతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకోగా, శ్రీశైలం మార్గంలో వాహనదారులు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచించారు.


