భద్రాద్రిలో రెండో విడత ప్రశాంతం
మొత్తం పోలింగ్ శాతం 82.65 నమోదు
కట్టుదిట్టమైన భద్రత మధ్య కౌంటింగ్
కాకతీయ, కొత్తగూడెం : భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో రెండో విడత గ్రామపంచాయతీ ఎన్నికల పోలింగ్ ఆదివారం ఎలాంటి అవాంఛనీయ ఘటనలు లేకుండా ప్రశాంత వాతావరణంలో విజయవంతంగా ముగిసింది. అధికారిక గణాంకాల ప్రకారం జిల్లాలోని 7 మండలాల్లో మొత్తం 1,96,395 మంది ఓటర్లు ఉండగా, వారిలో 1,62,323 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. మొత్తం పోలింగ్ శాతం 82.65గా నమోదైనట్లు అధికారులు తెలిపారు. ఇందులో పురుష ఓటర్లు 80,037 మంది, మహిళా ఓటర్లు 82,284 మంది, ఇతరులు 2 మంది ఉన్నారు. మండలాల వారీగా అన్నపురెడ్డిపల్లి మండలంలో 85.13 శాతం, అశ్వరావుపేటలో 87.85 శాతం, చంద్రుగొండలో 85.93 శాతం, చుంచుపల్లిలో 66.19 శాతం, దమ్మపేటలో 85.73 శాతం, ములకలపల్లిలో 86.59 శాతం, పాల్వంచలో 86.58 శాతం పోలింగ్ నమోదైనట్లు జిల్లా కలెక్టర్ తెలిపారు. పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లకు అవసరమైన అన్ని మౌలిక సదుపాయాలు కల్పించడంతో పాటు సమస్యాత్మక కేంద్రాల్లో వెబ్‌కాస్టింగ్ ద్వారా నిరంతర పర్యవేక్షణ చేపట్టినట్లు తెలిపారు. ఎన్నికల సిబ్బంది, పోలీస్ శాఖ సమన్వయంతో పనిచేయడంతో పోలింగ్ ప్రక్రియ సజావుగా సాగిందన్నారు. పోలింగ్ అనంతరం బ్యాలెట్ బాక్సులను భద్రతా నిబంధనల ప్రకారం కౌంటింగ్ కేంద్రాలకు తరలించామని, ప్రస్తుతం కౌంటింగ్ ప్రక్రియ కట్టుదిట్టమైన బందోబస్తు మధ్య పూర్తి పారదర్శకతతో కొనసాగుతోందని జిల్లా కలెక్టర్ జితేష్ పాటిల్ స్పష్టం చేశారు.


