కౌజు పిట్టల పెంపకంతో అధిక ఆదాయం
జిల్లా కలెక్టర్ జితేష్ పాటిల్
కాకతీయ, కొత్తగూడెం : గ్రామీణ ప్రాంతాల్లో తక్కువ పెట్టుబడితో అధిక ఆదాయం పొందేందుకు కౌజు పిట్టలు, నాటు కోళ్ల పెంపకం మంచి అవకాశమని జిల్లా కలెక్టర్ జితేష్ పాటిల్ అన్నారు. ఆదివారం దమ్మపేట మండలం నాగుపల్లి గ్రామంలో ఏర్పాటు చేసిన లక్కీ పౌల్ట్రీ ఫార్మ్‌ను ఆయన సందర్శించారు.
ఈ సందర్భంగా రైతు నాయుడు ప్రసాద్ దంపతులు నిర్వహిస్తున్న కౌజు పిట్టలు, నాటు కోళ్ల పెంపకం యూనిట్లతో పాటు ఇంక్యులేటర్ (గుడ్ల నుంచి పిల్లల ఉత్పత్తి) వ్యవస్థను కలెక్టర్ సమగ్రంగా పరిశీలించారు. ఫార్మ్‌లో అనుసరిస్తున్న ఆధునిక పెంపక విధానాలు, మేత తయారీ, ఆరోగ్య సంరక్షణ, శుభ్రత ప్రమాణాలు, ఉత్పత్తి సామర్థ్యం, మార్కెటింగ్ విధానాలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు.
ప్రత్యేకంగా ఇంక్యులేటర్ ద్వారా గుడ్ల నుంచి పిల్లల ఉత్పత్తి ప్రక్రియ, ఉష్ణోగ్రత నియంత్రణ, తేమ స్థాయి, హ్యాచింగ్ శాతం వంటి అంశాలపై నిర్వాహకులతో చర్చించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ, ఈ పౌల్ట్రీ ఫార్మ్ ద్వారా సుమారు 30 వేల కౌజు పిట్టల గుడ్లు, వెయ్యి నాటు కోడి గుడ్ల ఉత్పత్తి జరుగుతోందని తెలిపారు. ఇంక్యులేటర్ సహాయంతో ఆరోగ్యకరమైన పిల్లలను ఉత్పత్తి చేసి మహిళా స్వయం సహాయక సంఘాలు, చిన్న రైతులకు సరఫరా చేస్తున్నట్లు వివరించారు.ఈ యూనిట్‌ను మరింత విస్తరించి ఇంక్యులేటర్ సామర్థ్యాన్ని పెంచితే ఉపాధి అవకాశాలు మరింత పెరుగుతాయని కలెక్టర్ సూచించారు. విద్యుత్ ఖర్చును తగ్గించేందుకు సోలార్ విద్యుత్ వినియోగంపై దృష్టి సారించాలని, పౌల్ట్రీ రంగంలో ఈ యూనిట్ ఆదర్శంగా నిలవాలని పేర్కొన్నారు. జిల్లాలో ఇలాంటి నమూనా పౌల్ట్రీ యూనిట్లు మరిన్ని ఏర్పాటయ్యేలా రైతులు ముందుకు రావాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సంబంధిత శాఖల అధికారులు, రైతులు తదితరులు పాల్గొన్నారు.


