ఖమ్మం జిల్లాలో సర్పంచ్ అభ్యర్థి మృతి
పోలింగ్ రోజే విషాదం
కాకతీయ, ఖమ్మం : ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం అనాసాగర్ గ్రామంలో సర్పంచ్ అభ్యర్థి దామల నాగరాజు మృతి చెందడం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. స్వతంత్ర అభ్యర్థిగా ఎన్నికల బరిలోకి దిగిన నాగరాజు, ఎన్నికల ప్రచారంలో పాల్గొంటూ తీవ్ర ఒత్తిడికి లోనయ్యారని కుటుంబ సభ్యులు తెలిపారు.
ఆదివారం తెల్లవారుజామున అస్వస్థతకు గురైన నాగరాజును కుటుంబ సభ్యులు వెంటనే ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ పరిస్థితి విషమించడంతో సోమవారం తెల్లవారుజామున ఆయన తుదిశ్వాస విడిచారు. గ్రామంలో పోలింగ్ కొనసాగుతున్న సమయంలోనే సర్పంచ్ అభ్యర్థి మృతి చెందడంతో అనాసాగర్ గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. నాగరాజు మృతిపై గ్రామస్తులు, మద్దతుదారులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల వేళ చోటుచేసుకున్న ఈ విషాద ఘటన స్థానికంగా తీవ్ర చర్చకు దారి తీసింది.


