రెండో విడత ఎన్నికలకు భారీ భద్రత ఏర్పాట్లు
సమస్యాత్మక గ్రామాల్లో అడిషనల్ డీసీపీల పర్యవేక్షణ
1059 కేసుల్లో 7129 మందిని బైండోవర్
విజయోత్సవ ర్యాలీలకు అనుమతి లేదు
క్రిటికల్ పోలింగ్ కేంద్రాలలో పర్యటించిన పోలీస్ కమిషనర్ సునీల్ దత్
కాకతీయ, ఖమ్మం ప్రతినిధి : రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికలకు 2 వేల మంది పోలీసులతో భారీ భద్రత ఏర్పాట్లను చేపట్టినట్లు పోలీస్ కమిషనర్ సునీల్ దత్ తెలిపారు. రెండో విడత పోలింగ్ కేంద్రాలకు ఇప్పటికే పోలీస్ బలగాలు చేరుకున్నాయని అన్నారు. ప్రజల స్వేచ్ఛకు భంగం కలగకుండా ప్రలోభాలకు తావు లేకుండా ఓటరు పోలింగ్ కు కదిలేలా జిల్లా అధికార యంత్రాంగం ప్రత్యేక దృష్టి సారించి తగిన ఏర్పాట్లు చేసిందని తెలిపారు. ఇప్పటికే మండలలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా క్రిటికల్ పోలింగ్ స్టేషన్లలో అడిషనల్ డిసిపిల పర్యవేక్షణలో పోలీసు బలగాలను మొహరించినట్లు తెలిపారు. ఎన్నికలు జరుగుతున్న మండలల్లో స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్స్, రూట్ మొబైల్ పార్టీలు, 5 ఎఫ్ఎస్టీ బృందాలు, 15 ఎస్ఎస్టీ బృందాల ద్వారా నిఘా కొనసాగుతోందని పేర్కొన్నారు. డబ్బు, మద్యం ప్రభావాన్ని నియంత్రించేలా చేపట్టిన తనిఖీలలో సరియైన పత్రాలు లేని సుమారు 22 లక్షల రూపాయల నగదు, 12 లక్షల విలువ చేసే మద్యం సీజ్ చేసినట్లు తెలిపారు. అదేవిధంగా ఇప్పటికే 1059 బైండోవర్ కేసుల్లో 7129 మందిని బండోవర్ చేసినట్లు వివరించారు.
రెండో విడతల పోలింగ్ లో 77 క్రిటికల్ పోలింగ్ కేంద్రాలను గుర్తించామని, వాటిల్లో నామినేషన్ల దాఖలు ప్రక్రియ నుంచే పోలీసుల నిఘా పెంచామని, గ్రామంలో ప్రతి కదలికపై ఏసీపీ స్థాయి అధికారి ఆధ్వర్యంలో నిరంతరం పర్యవేక్షణ ఉంటుందన్నారు.
శాంతిభద్రతల దృష్ట్యా ఆయా ఎన్నికలు జరిగే మండలలో సెక్షన్ 163 బీ ఎన్ ఎస్ ఎస్ యాక్ట్ అమల్లో ఉన్న నేపథ్యంలో గెలుపొందిన అభ్యర్థుల విజయోత్సవ ర్యాలీలకు ఎటువంటి అనుమతి లేదని, నిబంధనలు అతిక్రమిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని అన్నారు.
ఖమ్మం రూరల్ మండలం క్రిటికల్ పోలింగ్ కేంద్రాలలో పర్యటించిన పోలీస్ కమిషనర్ పోలీస్ అధికారులకు దిశా నిర్దేశం చేశారు.


