ఎన్నికలు ముగిసేంత వరకు అప్రమత్తంగా ఉండాలి
– అడిషనల్ డీసీపీ
కాకతీయ, ఖమ్మం ప్రతినిధి : రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల పక్రియ ముగిసే వరకు పోలీస్ సిబ్బంది మరింత అప్రమత్తంగా ఉండాలని అడిషనల్ డీసీపీ లా &అర్డర్ ప్రసాద్ రావు అన్నారు.
పోలీస్ కమిషనర్ సునీల్ దత్ ఆదేశాల మేరకు ఖమ్మం రూరల్ మండలం ఎన్నికల సందర్భంగా పోలీస్ బందోబస్తు సిబ్బంది యొక్క విధివిధానాలపై స్థానిక రూరల్ పోలీస్ స్టేషన్ లో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా అడిషనల్ డీసీపీ మాట్లాడుతూ..గ్రామ పంచాయతీ ఎన్నికలను విజయవంతం చేయడానికి పోలీస్ సిబ్బంది సమయస్ఫూర్తితో వ్యవహరించాలని సూచించారు. ఎన్నికల విధులలో ఎవరైనా నిర్లక్ష్యం వహించినా, నిబంధనలను ఉల్లంఘించినా శాఖాపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని పేర్కొన్నారు. విధినిర్వహణలో సిబ్బందికి ఏదైనా ఇబ్బందులు, ఆకస్మిక సమస్యలు ఎదురైతే, వెంటనే ఉన్నత అధికారులకు సమాచారం అందించాలని, వ్యక్తిగతంగా నిర్ణయాలు తీసుకోవద్దని స్పష్టం చేశారు. ఎన్నికల ప్రవర్తన నియమావలిని ఖచ్చితంగా పాటిస్తూ..ఎన్నికల విధులలో ఎలాంటి అలసత్వం లేకుండా క్రమశిక్షణతో తమకు కేటాయించిన విధులను సక్రమంగా నిర్వహించాలని సూచించారు. కార్యక్రమంలో రూరల్ ఏసీపీ తిరుపతి రెడ్డి, ఏఆర్ ఏసీపీ నర్సయ్య, సిఐలు రాజు, తిరుపతిరెడ్డి పాల్గొన్నారు.


