కాంగ్రెస్ పతనం ప్రారంభమైంది
మొదటి విడతలో బీఆర్ఎస్ అభ్యర్థుల విజయమే నిదర్శనం
పరకాల మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి
కాకతీయ, గీసుగొండ : పంచాయతీ ఎన్నికలతోనే కాంగ్రెస్ ప్రభుత్వ పతనం ప్రారంభమైందని పరకాల మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. మండలంలోని ఊకల్ హవేలీ,శాయంపేట హవేలీ,బొడ్డు చింతలపల్లి గ్రామాల్లో నిర్వహించిన కార్యకర్తల సన్నాహక సమావేశాల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయ మాట్లాడుతూ.. సర్పంచ్ ఎన్నికలతో కాంగ్రెస్ ప్రభుత్వ అవస్థలు బయట పడుతున్నాయని పేర్కొన్నారు. మొదటి విడతలో వెంకటేశ్వర్లపల్లి గ్రామంలో బీఆర్‌ఎస్ బలపరిచిన అభ్యర్థి పెండ్యాల మహేందర్ రెడ్డి గెలుపు ప్రజల తీర్పుకు నిదర్శనమన్నారు. కాంగ్రెస్ తప్పుడు హామీలను నమ్మి మోసపోయామని ప్రజలు గ్రహించి, మళ్లీ మోసపోవడానికి సిద్ధంగా లేరని స్పష్టం చేశారు. బిఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో ప్రతి వర్గానికీ సంక్షేమం చేకూరిందని, గ్రామ పంచాయతీలకు నిధుల విడుదల, కులవృత్తులకు ప్రోత్సాహం వంటి ఎన్నో కార్యక్రమాలను కేసీఆర్ ప్రవేశపెట్టారని గుర్తు చేశారు. అయితే కాంగ్రెస్ రెండేళ్ల పాలనలో మత్స్యకారులకు చేప పిల్లల పంపిణీ నిలిచిపోయిందని,గొర్రెల పంపిణీ పూర్తిగా ఆగి పోయిందని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున ఓటు వేస్తేనే పథకాలు వర్తిస్తాయని, ఇందిరమ్మ ఇళ్ల బిల్లులు, పింఛన్ల విషయంలో ప్రజలను బెదిరిస్తున్నారని ఆరోపించారు.ఓటమి భయంతోనే అధికార పార్టీ ఈ రకమైన బెదిరింపులకు దిగుతోందని చెప్పారు. ప్రజలు ఏ పరిస్థితిలో ఉన్నా బీఆర్‌ఎస్ ఎప్పుడూ అండగా నిలుస్తుందని ధర్మారెడ్డి తెలిపారు. కాంగ్రెస్ నాయకులు ఓటు అడిగి వస్తే, ఇచ్చిన హామీల ఏమయ్యాయో నిలదీయాలని పిలుపు నిచ్చారు.సమావేశాల్లో మండల, గ్రామ మాజీ ప్రజాప్రతినిధులు, బీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు, యువ నాయకులు పాల్గొన్నారు.
సొంత గూటికి చేరిన నాయకులు
మండలంలోని ఊకల్ గ్రామంలో గతంలో కాంగ్రెస్‌లో చేరిన మాజీ ఎంపీటీసీ బేతినేని వీరారావు,సీనియర్ నాయకుడు మండల సదానందం ఆ పార్టీకి రాజీనామా చేసి తిరిగి బీఆర్‌ఎస్‌లో చేరారు. పరకాల మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి సమక్షంలో వీరిద్దరికీ గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.


