20న టీడబ్ల్యూజేఎఫ్ ఖమ్మం జిల్లా మహాసభ
జిల్లా కమిటీ, ఆహ్వానితుల సమావేశంలో నిర్ణయం
విజయవంతం చేయాల్సిందిగా జర్నలిస్టులకు పిలుపు
అక్రిడిటేషన్, ఇండ్లస్థలాల పాలసీ వెంటనే ప్రకటించాలి
మామిడి సోమయ్యకు టీడబ్ల్యూజేఎఫ్ కు సంబంధం లేదు
ఫెడరేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు రాజశేఖర్, శ్రీనివాసరెడ్డి, ఖదీర్
కాకతీయ, ఖమ్మం ప్రతినిధి : తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ (టీడబ్ల్యూజేఎఫ్) ఖమ్మం జిల్లా మహాసభలు ఈనెల 20వ తేదీన ఖమ్మంలో నిర్వహించనున్నట్లు ఫెడరేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు రాజశేఖర్, జిల్లా కార్యదర్శి కె. శ్రీనివాసరెడ్డి, స్టేట్ అడ్ హక్ కమిటీ సభ్యులు సయ్యద్ ఖదీర్ వెల్లడించారు. యూనియన్ జిల్లా ఉపాధ్యక్షులు గరిడేపల్లి వెంకటేశ్వర్లు అధ్యక్షతన ఖమ్మంలోని మంచికంటి ఫంక్షన్ హాల్ లో బుధవారం ఏర్పాటు చేసిన జిల్లా కమిటీ, ఆహ్వానితుల సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. జిల్లాకు చెందిన జర్నలిస్టులతో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలు, వివిధ పార్టీల నాయకులు, ఆయా రంగాల ప్రముఖులు, ఫెడరేషన్ రాష్ట్ర నాయకులను ఈ మహాసభలకు ఆహ్వానిస్తున్నట్లు ప్రకటించారు. జర్నలిస్టు మిత్రులు పెద్ద సంఖ్యలో హాజరై మహాసభలను విజయవంతం చేయాల్సిందిగా పిలుపునిచ్చారు. రాష్ట్రవ్యాప్త అక్రిడిటేషన్ పాలసీని వెంటనే ప్రకటించి, కొత్త కార్డులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. అర్హులు ఎవ్వరికీ అన్యాయం జరగకుండా చూడాలన్నారు. ప్రత్యేక పాలసీ ద్వారా జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని కోరారు. ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా జర్నలిస్టులకు హెల్త్ పాలసీ అమలు చేయాలని విజ్ఞప్తి చేశారు. మహిళా జర్నలిస్టులకు రాత్రి వేళల్లో ప్రయాణ సౌకర్యం కల్పించాలని కోరారు. వర్కింగ్ జర్నలిస్టు సంఘాలను రద్దు చేస్తూ కేంద్రం తెచ్చిన లేబర్ కోడ్ ను రాష్ట్రంలో అమలు కాకుండా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
జర్నలిస్టుల గందరగోళ పరిచేలా సోమయ్య ప్రకటనలు
మామిడి సోమయ్యకు టీడబ్ల్యూజేఎఫ్ కు ఎలాంటి సంబంధం లేదని రాష్ట్ర ఉపాధ్యక్షులు రాజశేఖర్ స్పష్టం చేశారు. సంఘం వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడిన
సోమయ్య ను సంఘం నుంచి శాశ్వతంగా తొలగిస్తూ రాష్ట్ర కార్యవర్గం, జనరల్ బాడీ తీర్మానం చేసిందని గుర్తు చేశారు. ఉనికి కోసమే ఆయన జిల్లాల్లో తిరుగుతూ జర్నలిస్టులను గందరగోళపరుస్తున్నారని అన్నారు. ఈ సమావేశంలో టీడబ్ల్యూజేఎఫ్ జిల్లా నాయకులు జక్కంపూడి కృష్ణ, కోటి శివారెడ్డి, దువ్వా సాగర్, కూరాకుల గోపీ, మానుకొండ రవికిరణ్, ఆవుల శ్రీనివాస్, షేక్ జానీపాష, కొత్త యాకేష్, మధుశ్రీ, దేవేందర్, కరుణాకర్ రెడ్డి, షకీల్ తదితరులు పాల్గొన్నారు.


