చిరు వ్యాపారుల నుంచి అక్రమంగా వసూళ్లు
బాధ్యులను గుర్తించి వెంటనే చర్యలు తీసుకోవాలి
బీజేపీ రాష్ట్ర కోశాధికారి దేవకి వాసుదేవ రావు
ఖమ్మం పాత బస్టాండ్ ఏరియా వీధి వ్యాపారుల నుంచి ఆరా
కాకతీయ, ఖమ్మం ప్రతినిధి : ఖమ్మం వీధి వ్యాపారుల నుంచి వసూళ్లకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని బీజేపీ రాష్ట్ర కోశాధికారి దేవకి వాసుదేవ రావు డిమాండ్ చేశారు. ఖమ్మం కార్పొరేషన్ పరిధిలోని పాత బస్టాండ్ ఎదురుగా ఉన్న వీధి వ్యాపారుల ప్రాంగణ మార్కెట్‌ను బుధవారం బీజేపీ జిల్లా అధ్యక్షుడు నెల్లూరు కోటేశ్వర రావుతోకలిసి దేవకి వాసుదేవ రావు సందర్శించారు. ఈసందర్భంగా ఆయన వీధి వ్యాపారులతో మాట్లాడారు. మార్కెట్లో చిరు వ్యాపారులను కొంతమంది ఇబ్బంది పెడుతున్నారనే విషయం తెలుసుకున్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. వ్యాపారులపై జరుగుతున్న అన్యాయ వసూళ్లు, బెదిరింపులు, వారిని ఒకరితో ఒకరు గొడవ పెట్టే ప్రయత్నాలు అత్యంత తీవ్రంగా పరిగణించాల్సిన అంశాలని అన్నారు. ప్రభుత్వ అధికారులు రసీదు లేకుండా 240 మంది వ్యాపారుల దగ్గర ఒక్కొక్కరికీ ₹10,000 చొప్పున వసూలు చేసినట్టు ఫిర్యాదులు అందుతున్నాయని అన్నారు. ఈవిషయంపై మునిసిపల్ అధికారులు సమగ్రమైన విచారణ చేపట్టాలని, బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో బీజేపీ ఆధ్వర్యంలో ఆందోళనలు చేపడుతామని హెచ్చరించారు. కార్యక్రమంలో బీజేపీ టూ టౌన్ అధ్యక్షుడు ధనియాకుల వెంకటనారాయణ, అసెంబ్లీ కన్వీనర్ అల్లిక అంజయ్య, మందారపు సుబ్బారావు, మాధవ్ గౌడ్, శాసనాల సాయిరాం, కందుల శ్రీకృష్ణ మరియు వీధి వ్యాపారులు, బీజేపీ కార్యకర్తలు పాల్గొన్నారు.


