విద్యార్థులను అన్ని రంగాల్లో ప్రోత్సహించాలి
ఉపాధ్యాయులకు కలెక్టర్ సూచన
బొజ్జి గుప్ప మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల పరిశీలన
కాకతీయ, కొత్తగూడెం : విద్యార్థులను చదువుతోపాటుగా అన్ని రంగాల్లో ప్రోత్సహించే విధంగా ఉపాధ్యాయులు కృషి చేయాలని భద్రాద్రి జిల్లా కలెక్టర్ జితేష్ పాటిల్ సూచించారు. దుమ్ముగూడెం మండలంలోని బొజ్జి గుప్ప గ్రామంలో గల మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలను బుధవారం జిల్లా కలెక్టర్ జితేష్ పాటిల్ సందర్శించి పాఠశాల నిర్వహణ బోధన ప్రమాణాలు విద్యార్థుల నేర్పును సమగ్రంగా పరిశీలించారు. తరగతి గదులు సందర్శించి విద్యా స్థాయి హాజరు పాఠశాలలో అమలు చేస్తున్న విద్యా కార్యక్రమాలపై వివరాలు తెలుసుకున్నారు. పాఠశాలలో ఏర్పాటు చేసిన కిషన్ షెడ్ ఆవరణలో పెంచుతున్న వివిధ రకాల మొక్కలను పరిశీలించి వాటి పరిరక్షణ సంరక్షణ పట్ల సంతోషం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ విద్యార్థులు రాయడం చదవడం నైపుణ్యాలతో పాటు క్రీడలపై ఆసక్తి పెంచుకునేలా పాఠశాలలో సమగ్ర అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు. క్రీడలు ఆటలు విద్యార్థుల శారీరక మానసిక వికాసానికి అత్యంత కీలకం అన్నారు. విద్యార్థులకు నోట్‌బుక్స్ పెన్నులను అందజేసి క్రమం తప్పకుండా చదువులో ముందుకు సాగే విధంగా ఉపాధ్యాయులు కృషి చేయాలన్నారు. అనంతరం కలెక్టర్ విద్యార్థులతో మాట్లాడుతూ ప్రతిరోజూ పాఠశాలకు హాజరై పాఠాలు నేర్చుకునే అలవాటు పెంపొందించుకోవాలని సూచించారు. బుజ్జి గొప్ప గ్రామంలో గత సంవత్సరం ఏరు ఫెస్టివల్ లో భాగంగా చేపట్టిన విధంగానే గిరిజన సంప్రదాయాలు ఆదివాసీల ఆవాసాలు ఆహార అలవాట్లను బాహ్య ప్రపంచానికి తెలిసే విధంగా ఈ సంవత్సరం కూడా ఏర్పాట్లు చేయాలని దానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని సంబంధిత శాఖల అధికారులకు సూచించారు. ఈ పరిశీలనలో కలెక్టర్ వెంట ఉపాధ్యాయులు వసంతరావు సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.


