ప్రతి అభ్యర్థి బాధ్యతగా వ్యవహరించాలి
: ఖమ్మం సీపీ సునిల్ దత్
కాకతీయ, ఖమ్మం ప్రతినిధి : గ్రామ పంచాయతీ ఎన్నికలను శాంతియుత వాతావరణంలో జరిగేందుకు ప్రతి అభ్యర్థి బాధ్యతగా వ్యవహరించాలని పోలీస్ కమిషనర్ సునీల్ దత్ పిలుపునిచ్చారు.
ఖమ్మం రూరల్ పోలీసుల ఆధ్వర్యంలో రూరల్ మండలం ఎన్నికలలో సర్పంచ్ గా నామినేషన్ వేసిన అభ్యర్థులకు అవగాహన కార్యక్రమాన్ని రామ్ లీలా ఫంక్షన్ హాల్లో నిర్వహించారు.
ఈ సందర్బంగా పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో ఎన్నికలు చాలా కీలకమని, వ్యక్తిగత దూషణలకు వెళ్లకుండా అందరూ సమన్వయం పాటించాలని అన్నారు.
గ్రామాల్లో ఏదైనా ఘర్షణ వాతావరణం ఉంటే పోలీసులు సమాచారం ఇవ్వాలని సూచించారు.
అభ్యర్థులు ఎన్నికల నిబంధనలు గౌరవించి పోలీసులకు సహకరిస్తే ఎన్నికలు మరింత ప్రశాంతంగా కొనసాగుతాయని అన్నారు. ఓటర్లను ఎలాంటి ప్రలోభాలకు గురిచేయవద్దని విజ్ఞప్తి చేశారు. నియమ నిబంధనలు పాటించకపోతే కేసులు సైతం నమోదు అవుతాయని తెలిపారు. ఎక్కడ కూడా శాంతిభద్రతల సమస్య రాకుండా పోలీసులు సూచనలు పాటించాలని అన్నారు. ముఖ్యంగా సెక్షన్ 163 బి ఎన్ ఎస్ ఎస్ యాక్ట్ అమల్లో ఉన్న నేపథ్యంలో ఎన్నికలు, ఫలితాల అనంతరం ఎలాంటి ర్యాలీలు గాని సమావేశాలకు గాని అనుమతి లేదని, ఇది గమనించి అందరూ సహకరించాలని అన్నారు.
కార్యక్రమంలో ట్రైని డిప్యూటీ కలెక్టర్ ఎం. అపూర్వ, ఏఆర్ అడిషనల్ డీసీపీ విజయబాబు, ఏసీపీ తిరుపతి రెడ్డి, ఏ ఆర్ ఏసీపీ నర్సయ్య, ఎంఆర్వో రామ్ ప్రసాద్, ఎంపిడివో రవికుమార్, శ్రీనివాస్ రావు, సిఐ రాజు, తిరుపతి రెడ్డి పాల్గొన్నారు.


