గ్రామాభివృద్ధి కాంగ్రెస్‌తోనే సాధ్యం : దయాకర్ రెడ్డి
కాకతీయ, ఖమ్మం రూరల్ : గ్రామాలను ప్రగతిపథంలో నడిపించే సత్తా కేవలం కాంగ్రెస్ పార్టీకే ఉందని మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి క్యాంప్ కార్యాలయ ఇన్‌చార్జి తుంబూరు దయాకర్ రెడ్డి స్పష్టం చేశారు. పంచాయతీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన మంగళవారం పాలేరు నియోజకవర్గం తిరుమలాయపాలెం మండలంలోని వెదుళ్లచెర్వు, బాలాజీనగర్ తండా పంచాయతీల్లో విస్తృతంగా పర్యటించారు. ఈ సందర్భంగా దయాకర్ రెడ్డి మాట్లాడుతూ వెదుళ్ల చెర్వులో సీపీఐ(ఎంఎల్) మద్దతుతో కాంగ్రెస్ సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న సాలె ఈరమ్మను, బాలాజీనగర్ తండాలో కాంగ్రెస్ అభ్యర్థి రమావత్ రమణను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి నేతృత్వంలో పాలేరు నియోజకవర్గం అభివృద్ధిలో కొత్త అధ్యాయాన్ని లిఖిస్తోందని ఆయన తెలిపారు. పేదలకు ఇళ్లు, 200 యూనిట్ల ఉచిత విద్యుత్, మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం వంటి హామీలను కాంగ్రెస్ ఇప్పటికే అమలు చేసి చూపించిందని దయాకర్‌రెడ్డి గుర్తు చేశారు. అర్హులైన ప్రతి కుటుంబానికి డబుల్ బెడ్‌రూం ఇళ్లు, రేషన్ కార్డులు, ఉచిత విద్యుత్ అందించేందుకు ప్రభుత్వం పూర్తి నిబద్ధతతో ఉందన్నారు. ఈ సంక్షేమ పథకాలు కేవలం మాటలు కావు, కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు అందిస్తున్న హామీలు అని వ్యాఖ్యానించారు. కార్యక్రమంలో పాలేరు నియోజకవర్గ ఆత్మ కమిటీ చైర్మన్ చావా శివ రామకృష్ణ, మండల పార్టీ అధ్యక్షుడు బెల్లం శ్రీనివాస్ , మాజీ ఎంపీపీ బోడ మంగీలాల్, జడల నగేష్ గౌడ్ మహేష్ తదితరులు పాల్గొన్నారు.


