స్కాంకు ప్లాన్ చేసి..స్కీం
కొత్తగూడెం పెద్ద బజారు కేంద్రంగా దందా
లిమిటెడ్ మెంబెర్స్.. అన్ లిమిటెడ్ ఖాతాలు…
గుట్టు చప్పుడు కాకుండా జరుగుతున్న దందా
తెరవెనుక ఆ నలుగురు అసలు సూత్రధారులు?
కాకతీయ ప్రతినిధి,కొత్తగూడెం: భదాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంగా స్కీముల పేరిట స్కాములకు తెర తీశారు కొంతమంది పెద్ద మనుషులు. తమ వ్యాపారాలు చేసుకుంటూనే అదనపు సంపాదన కోసం కొంతమంది బడా బాబులు కుమ్మక్కై స్కీములు నడుపుతూ ప్రపంచానికి తెలవని స్కాములు చేస్తున్నారు. పారిశ్రామిక ప్రాంతమైన కొత్తగూడెం జిల్లా కేంద్రంలో ఇటువంటి దందాలు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయి. పేద మధ్య తరగతి ప్రజల ఆశలను అదునుగా చేసుకొని లక్కీ డ్రా తగిలితే మీకు కారు వస్తుంది.. బంగారం వస్తుందంటూ ప్రజల వద్ద నుంచి వేలలో వసూలు చేస్తూ కోట్లు గడిస్తున్నారు.
లిమిటెడ్ మెంబెర్స్… అన్ లిమిటెడ్ ఖాతాలు..
కొత్తగూడెంలో ఓ వ్యాపారి మరో ముగ్గురితో కుమ్మక్కై స్కీం పేరిట పెద్ద స్కాంకు వ్యూహరచన చేస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. కేవలం 1000 మందితో మాత్రమే స్కీం నడిపిస్తామంటూ రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి చేసుకున్న వీళ్ళు సుమారు 6000 మంది సభ్యుల వరకు స్కీం సభ్యత్వాలు ఇచ్చి ప్రతి నెల సుమారు రూ.30 లక్షల వరకు వసూలు చేస్తున్నారు. ఈ స్కీం కాల పరిమితి 60 నెలలట. ఈ స్కీం కి సంబంధించి ఆఫీస్ ఎక్కడుందో తెలియదు. ప్రతినెల లక్కీ డ్రా ఎక్కడ తీస్తారో తెలియదు. కానీ కలెక్షన్ ఏజెంట్లు మాత్రం ప్రతినెల వసూళ్లకు తిరుగుతుంటారు. హంగు ఆర్భాటం లేకుండా బయట ప్రపంచానికి తెలియకుండా నడిచే ఈ దందాకు కొత్తగూడెం పెద్ద బజారులోని కొంతమంది పెద్ద మనుషులు ప్రాతినిధ్యం వహిస్తున్నట్లు తెలుస్తోంది.
అసలు సూత్రధారులు ఎవరు.?
గుట్టు చప్పుడు కాకుండా జరుగుతున్న దందా వెనుక అసలు సూత్రధారులు మాత్రం నలుగురు ఉన్నట్లుగా తెలుస్తోంది. వీరంతా సిండికేట్ అయి ఈ అక్రమ దందాకు ప్రాణం పోసినట్లు తెలుస్తోంది. 60 నెలల కాల పరిమితి అయిన వెంటనే లక్కీ డ్రా లో గెలుపొందని వ్యక్తులకు స్కీం లాస్ రుసుము మినహాయించి వారు కట్టిన సొమ్ము తిరిగి ఇస్తామని కల్లబొల్లి మాటలు చెప్పి అనేక మోసాలకు పాల్పడుతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ స్కీమ్‌కి అడ్డు చెప్పే అధికారి లేరని ప్రచారం జోరుగా సాగుతోంది. ఈ స్కీం పూర్తయ్యే నాటికి రూ.180 కోట్ల వరకు వ్యాపారం చేరుకుంటుందని, స్కీమ్ కట్టిన వారికి ఎటువంటి భరోసా లేదని ప్రజలు అభిప్రాయపడుతున్నారు.


