ఎన్నికల ప్రక్రియను పకడ్బందీగా నిర్వహించాలి
కలెక్టర్ జితేష్ పాటిల్
కాకతీయ, కొత్తగూడెం : పంచాయతీ ఎన్నికల సంపూర్ణ ప్రక్రియను ఎటువంటి పొరపాట్లకు తావులేకుండా పకడ్బందీగా నిర్వహించాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ జితేష్ పాటిల్ సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం ఆయన చండుగొండ మండలంలోని ఎంపీడీవో కార్యాలయాన్ని సందర్శించి ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ ఆర్.ఓలు, ఏఈఓలతో సమావేశమై ఎన్నికల ప్రక్రియలో ప్రతి దశను నియమ నిబంధనలకు అనుగుణంగా అమలు చేయాలని ఎటువంటి నిర్లక్ష్యం జరగకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని సూచించారు. అధికారులు నిర్వహిస్తున్న రికార్డులను విపులంగా పరిశీలించిన ఆయన పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ నిర్వహణకు అవసరమైన అన్ని ఏర్పాట్లు ముందస్తుగా పూర్తి చేయాలని ఆదేశించారు. పోలింగ్ సిబ్బంది నుండి పోస్టల్ బ్యాలెట్ జారీ చేసే సమయంలో ఫారం–17, డ్యూటీ ఆర్డర్ కాపీని తప్పనిసరిగా పరిశీలించాలని పోస్టల్ బ్యాలెట్ వెనుక రిటర్నింగ్ అధికారి సంతకం స్పష్టంగా ఉండాలని అదే లేకపోతే ఆ ఓటు చెల్లదని స్పష్టం చేశారు. అదేవిధంగా బ్యాలెట్ బాక్సులు పోలింగ్ మెటీరియల్ పంపిణీ కేంద్రాలలో ఏర్పాటు చేయాల్సిన వసతులు పోలింగ్ సిబ్బందికి అందించాల్సిన భోజన ఏర్పాట్లు రూట్‌వారిగా మెటీరియల్ పంపిణీ రవాణా ప్రణాళికలపై అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఎన్నికల పోలింగ్ పూర్తయిన తర్వాత ఓట్ల లెక్కింపు ఉప సర్పంచి ఎంపిక తిరిగి బ్యాలెట్ బాక్సులు రిసెప్షన్ సెంటర్‌కు పంపిణీ చేసే దశల్లో అత్యంత జాగ్రత్తలు భద్రతా చర్యలు పాటించాలని కలెక్టర్ జితేష్ పాటిల్ ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు


