పఠన సామర్థ్యం పెంపునకు ఎవ్రీ చైల్డ్ రీడ్స్
కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి
కాకతీయ, ఖమ్మం ప్రతినిధి :పిల్లల పఠన సామర్థ్యం పెంపుకు ఎవ్రీ చైల్డ్ రీడ్స్ కార్యక్రమం రెండవ దశ అమలు చేయాలని జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి అన్నారు. జిల్లా కలెక్టర్, కలెక్టరేట్ సమావేశ మందిరంలో శనివారం విద్యాశాఖ అధికారులు, హెడ్మాస్టర్లు, పాఠశాల సిబ్బందితో ఎవ్రీ చైల్డ్ రీడ్స్ కార్యక్రమం అమలుపై సమీక్షించి దిశా నిర్దేశం చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి మాట్లాడుతూ ఎవ్రీ చైల్డ్ రీడ్స్ కార్యక్రమం మొదటి దశను విజయవంతంగా అమలు చేసిన ఉపాధ్యాయులకు, పాఠశాల సిబ్బందికి అభినందనలు తెలిపారు. రెండవ దశ ఎవ్రీ చైల్డ్ రీడ్స్ కార్యక్రమం పై ఉపాధ్యాయులు అందించిన ఫీడ్ బ్యాక్ ప్రకారం కార్యచరణ సిద్ధం చేశామని అన్నారు.
రెండవ దశ ఎవ్రీ చైల్డ్ రీడ్స్ కార్యక్రమంలో పిల్లల కోసం రెండు రకాల స్టడీ మెటీరియల్స్ సిద్దం చేశామని, వెనుక బడిన విద్యార్దులకు బేసిక్స్ మరింత బలోపేతం చేసేలా మెటీరియల్, మంచి ప్రగతి సాధించిన విద్యార్థులకు వైవిధ్యమైన పదాలతో కూడిన మెటీరియల్ తయారు చేశామని అన్నారు. ఎవ్రీ చైల్డ్ రీడ్స్ కార్యక్రమం ప్రారంభించిన మొదటి వారం కేవలం 11 శాతం విద్యార్థులు మాత్రమే వ్యాఖ్యాలు చదివే సామర్థ్యంతో ఉన్నారని, గత బుధవారం ఆ సంఖ్య 36 శాతానికి చేరిందని కలెక్టర్ తెలిపారు. పిల్లలకు జీవిత కాలం ఉపయోగపడే సామర్థ్యాన్ని మనం అందిస్తున్నామని తెలిపారు. రెండవ దశ ఎవ్రీ చైల్డ్ రీడ్స్ కార్యక్రమం అమలులో పదాలు చదివే సామర్థ్యం ఉన్న పిల్లలు వ్యాఖ్యలు చదివేలా, అక్షరాలను చదివే పిల్లలు పదాలు చదివేలా సామర్ధ్య పెంపుకు కృషి చేయాలని కలెక్టర్ తెలిపారు. జనవరి మొదటి వారం వరకు 75 శాతం విద్యార్థులకు వ్యాఖ్యలు చదివే సామర్థ్యం రావాలని కలెక్టర్ పేర్కొన్నారు.
జిల్లా విద్యాశాఖ అధికారిణి చైతన్య జైని మాట్లాడుతూ ప్రతి పాఠశాలలో పిల్లలకు రోజు రీడింగ్ చేసే అలవాటు వచ్చిందని, ఎవ్రీ చైల్డ్ రీడ్స్ కార్యక్రమం అమలు చాలా సంతృప్తిని కలిగించిందని అన్నారు.
అనంతరం కలెక్టర్ ఉపాధ్యాయుల నుంచి ఎవ్రీ చైల్డ్ రీడ్స్ కార్యక్రమం అమలు ద్వారా వచ్చిన ఫలితాలను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ ప్లానింగ్ కోఆర్డినేటర్ సి.హెచ్. రామకృష్ణ, సిఎంఓ ప్రవీణ్, కాంప్లెక్స్ హెచ్ ఎంలు, ఆర్పిలు, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.


