సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలి
టౌన్ ఏసీపీ రమణమూర్తి
కాకతీయ, ఖమ్మం ప్రతినిధి : సైబర్ నేరాలపై అప్రమత్తంగా ఉండాలని, డిజిటల్‌గా అరెస్ట్ చేస్తామని బెదిరించి, డబ్బులు డిమాండ్ చేసే సైబర్ నేరగాళ్ళ మాయమాటలు నమ్మి మోసపోవద్దని టౌన్ ఏసీపీ రమణమూర్తి అన్నారు. తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో ఆధ్వర్యంలో ప్రారంభమైన “ఫ్రాడ్ కా ఫుల్ స్టాప్” పేరుతో నిర్వహిస్తున్న సైబర్ క్రైమ్ అవగాహన కార్యక్రమంలో భాగంగా ఖమ్మం ఆర్టీసీ బస్టాండ్ లో ప్రయాణికులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించారు. ఈ సందర్బంగా ఏసీపీ మాట్లాడుతూ..మీ వ్యక్తిగత సమాచారాన్ని, ముఖ్యంగా పాస్‌వర్డ్‌లు, బ్యాంక్ వివరాలు, ఓటీపీ లను ఎవరితోనూ పంచుకోవద్దని అన్నారు.అపరిచిత లింక్‌లపై క్లిక్ చేయవద్దని, ఫోన్ ద్వారా వచ్చిన అటాచ్‌మెంట్‌లను తెరవవద్దని సూచించారు. డబ్బును బదిలీ చేయమని, నగదు తీసుకుని ఇవ్వమని కోరే ఎటువంటి అభ్యర్థనలను విశ్వసించవద్దని పేర్కొన్నారు. మీరు ఏదైనా మోసానికి గురైనట్లు భావిస్తే, వెంటనే సైబర్ క్రైమ్ పోలీసులకు లేదా సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేయాలని విజ్ఞప్తి చేశారు.
కార్యక్రమంలో ఇన్స్పెక్టర్ బాలకృష్ణ పాల్గొన్నారు.


