అన్నారంలో ఇసుక లారీల అరాచకం
రోడ్డెక్కిన మహిళలు
గంటలపాటు ట్రాఫిక్ జాం
సమస్య పరిష్కరించాలంటూ డిమాండ్
కాకతీయ, కరీంనగర్ : కరీంనగర్ జిల్లా మానకొండూరు మండలం అన్నారం గ్రామంలో ఇసుక లారీల అధిక రవాణాపై స్థానిక మహిళలు శుక్రవారం రహదారిపై భారీగా ధర్నాకు దిగారు. దీంతో మార్గమధ్యంలో గంటలపాటు ట్రాఫిక్ నిలిచిపోయింది.గ్రామస్తుల వివరాల ప్రకారం.ప్రతిరోజూ వందల సంఖ్యలో ఇసుక లారీలు వేగంగా దూసుకుపోవడంతో దుమ్ముదూళి ముసురుకుని పిల్లలు, వృద్ధులు ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారని తెలిపారు. భారీ ఇసుక లోడుతో లారీలు వెళ్లటం వల్ల రహదారులు గుంతలతో ప్రమాదకరంగా మారాయని, ఇప్పటికే చిన్నపాటి ప్రమాదాలు చోటుచేసుకున్నాయని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు.సమస్యను పలుమార్లు అధికారులకు తెలపగా స్పందన రాలేదు… అందుకే రోడ్డెక్కాం అని మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రామ రహదారులకు శాశ్వత పరిష్కారం చూపాలని, ఇసుక లారీ రవాణాపై కఠిన నియంత్రణలు విధించాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.



