కొణిజేటి రోశయ్య సేవలు చిరస్మరణీయం
భద్రాద్రి కొత్తగూడెం కలెక్టర్ జితేష్ పాటిల్
కాకతీయ, కొత్తగూడెం : ప్రజా ప్రతినిధిగా కొణిజేటి రోశయ్య గొప్ప సేవలు అందించారని కలెక్టర్ జితేష్ పాటిల్ అన్నారు. మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య నాల్గవ వర్ధంతి సభను ఐడీఓసీ కార్యాలయంలో జిల్లా యువజన క్రీడల శాఖ ఆధ్వర్యంలో గురువారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ జితేష్ పాటిల్ పాల్గొని రోశయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ కొణిజేటి రోశయ్య రాష్ట్ర ముఖ్యమంత్రిగా, ఇతర రాష్ట్రాలకు గవర్నర్ గా విశిష్టమైన సేవలు అందించారని తెలిపారు. రోశయ్య రాజకీయ జీవితమంతా ప్రజల సంక్షేమం నిస్వార్థ సేవకే అంకితమైందని ఆయన సేవలను గుర్తు చేశారు. ఆచరణలో సాధారణత పరిపాలనలో ప్రతిభ ఆయన ప్రత్యేకతని కొనియాడారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో రాష్ట్ర ఆర్థిక భవిష్యత్తు కోసం కొణిజేటి రోశయ్య ఎన్నో ఆర్థిక సంస్కరణలు తీసుకొచ్చారని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా యువజన క్రీడా శాఖ అధికారి పరందామరెడ్డి, బీసీ సంక్షేమ అధికారి విజయలక్ష్మి, లీడ్ బ్యాంక్ మేనేజర్ రామిరెడ్డి, అన్ని శాఖల అధికారులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.


