ఎన్నికల శిక్షణా కేంద్రాలను సందర్శించిన పరిశీలకులు సర్వేశ్వర్ రెడ్డి
కాకతీయ, కొత్తగూడెం : గ్రామ పంచాయతీ సాధారణ ఎన్నికల పర్యవేక్షణకు నియమితులైన పరిశీలకులు వి.సర్వేశ్వర్ రెడ్డి బుధవారం జిల్లాలోని పలు మండలాలను సందర్శించి ఎన్నికల ఏర్పాట్లను సమగ్రంగా పరిశీలించారు. ఎన్నికల నిర్వహణలో ఏ చిన్న లోపం చోటుచేసుకోకుండా అధికారులు అత్యంత బాధ్యతతో వ్యవహరించాలని ఆయన సూచనలు జారీ చేశారు. ముందుగా ఆయన ఆర్వోలు ఏఆర్ఓల శిక్షణ కేంద్రాలను సందర్శించారు. పరిశీలనలో భాగంగా పాల్వంచ మండలంలోని అనుబోస్ కాలేజీలో నిర్వహిస్తున్న శిక్షణా కార్యక్రమాన్ని తనిఖీ చేసి శిక్షకులు ఇస్తున్న మార్గదర్శకాలు శిక్షణ పాఠ్యాంశాలు హాజరు రికార్డులు వంటి అంశాలను వివరంగా పరిశీలించారు. అనంతరం బర్గంపహాడ్ మండలంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల, భద్రాచలం మండలంలోని రైతు వేదికలో ఏర్పాటు చేసిన శిక్షణ కేంద్రాలను సందర్శించి సిబ్బందికి అందజేస్తున్న నామినేషన్ ప్రక్రియ, కోడ్ ఆఫ్ కండక్ట్, ఎన్నికల రోజున చేపట్టాల్సిన వివిధ విధులపై శిక్షణ నాణ్యతను సమీక్షించారు. శిక్షణా కేంద్రాల్లో మౌలిక వసతులు సమృద్ధిగా ఉండటం పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు. ప్రజలు తమ ఓటు హక్కును స్వేచ్ఛగా వినియోగించుకునేలా ప్రశాంత వాతావరణం కల్పించేందుకు జిల్లా యంత్రాంగం పూర్తి స్థాయిలో సన్నద్ధంగా ఉందని పరిశీలకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో సంబంధిత శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు.


