భద్రాచలం రోడ్ రైల్వే స్టేషన్లో నాటు బాంబుల కలకలం
నాటు బాంబును కొరికిన కుక్క.. బాంబు పేలడంతో కుక్క అక్కడికక్కడే మృతి
విచారణ చేపట్టిన పోలీసులు .. ఆందోళనకు గురైన ప్రయాణికులు
కాకతీయ, కొత్తగూడెం : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం రోడ్ రైల్వే స్టేషన్ మొదటి ప్లాట్ఫారం పక్కన రైల్వే పట్టాలపై బుధవారం నాటు బాంబు పేలుడు ఘటన కలకలం రేపింది. ఈ బాంబును కొరికిన కుక్క అక్కడికక్కడే మృతి చెందింది. పేలుడు సంఘటనతో రైల్వే ప్రయాణికులు ఆందోళనకు గురయ్యారు. పేలుడు ఘటన పోలీసుల దృష్టికి పోవడంతో వారు వెంటనే రంగంలోకి దిగి రైల్వే స్టేషన్ ను డాగ్ స్క్వాడ్ తో క్షుణ్ణంగా తనిఖీలు చేపట్టారు. అంతేకాకుండా పేలుడు దాటికి కుక్క మృతి చెందడంతో పోలీసులు సమగ్ర విచారణను సైతం చేపట్టారు. చివరిగా అది నాటు బాంబు అని తేలడంతో ఇటు ప్రయాణికులు అటు అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. జంతువులను వేటాడడానికి ఉపయోగించే బాంబులని తేల్చారు. గుర్తుతెలియని వ్యక్తులు నాటుబాంబులతో కూడిన సంచిని పెంటకుప్పలో పడి వేయడం వల్ల అది గమనించిన ఒక ఊర కుక్క మూటతో ఉన్న సంచిని రైల్వే పట్టాల దగ్గరకు తీసుకువచ్చి
సంచిని తెరిచి అందులో ఉన్న ఒక బాంబును కొరకడంతో పేలుడు దాటికి కుక్క అక్కడికక్కడే మృతి చెందిందని అధికారులు వివరించారు. ఈ సంఘటనపై ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఒక ప్రకటన జారీ చేశారు. అంతేకాకుండా ఈ ఘటనపై సోషల్ మీడియాలో ఎలాంటి తప్పుడు ప్రచారాలు చేయవద్దని హెచ్చరించారు. ఏది ఏమైనప్పటికీ రైల్వే పట్టాలపై బాబు పేలి కుక్క మృతి చెందిందని ప్రచారం జరగడంతో ప్రయాణికులు ప్రజలంతా ఆందోళనకు గురయ్యారు. ఎస్పీ ప్రకటనతో ప్రజలంతా ఊపిరి పీల్చుకున్నారు.


