నాటు బాంబులపై తప్పుడు ప్రచారం చేయొద్దు
కొత్తగూడెం జిల్లా ఎస్పీ రోహిత్ రాజు
కాకతీయ, కొత్తగూడెం : అడవి జంతువులను వేటాడడానికి తయారు చేసిన నాటు బాంబును కొరికి కుక్క మృతి చెందిందని ఈ ఘటనపై సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారాలు చేయవద్దని ఎస్పీ రోహిత్ రాజు సూచిస్తూ బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. కొత్తగూడెం త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రైల్వే ట్రాక్ పై ఉల్లిగడ్డ ఆకారంలోని నాటుబాంబును కొరికి ఒక కుక్క మృతి చెందడం జరిగిందని తెలిపారు. రైల్వే స్టేషన్ పరిసర ప్రాంతాల్లోని చెత్త పడేసే ప్రదేశం నుండి ఒక కుక్క తినే పదార్థంలా భావించి అడవి జంతువులను వేటాడటానికి తయారు చేసిన నాటుబాంబును రైల్వే ట్రాక్ మీదకు తీసుకువచ్చి కొరకడంతో అది ప్రేలి కుక్క అక్కడికక్కడే మృతి చెందడం జరిగిందని ఎస్పీ వివరించారు. నాటు బాంబులను చెత్తలో పడేసిన వ్యక్తుల గురించి పోలీసులు విచారణ చేపట్టడం జరిగిందని తెలిపారు. ఈ ఘటనలో మరేవిధమైన కోణం లేదని ఎస్పీ నిర్ధారించారు. కావునా ఎవరూ కూడా సోషల్ మీడియాలో ఈ విషయంపై తప్పుడు ప్రచారం చేయొద్దని కోరారు.


