పొగమంచులో వాహన ప్రయాణం ప్రమాదకరం
పోలీస్ కమిషనర్ సునీల్ దత్
కాకతీయ, ఖమ్మం ప్రతినిధి: దట్టమైన పొగమంచు సమయాల్లో వాహన ప్రయాణం ప్రమాదకరమని,
అత్యవసరమైతే తప్ప ప్రయాణాలు నివారించాలని పోలీస్ కమిషనర్ సునీల్ దత్ ప్రయాణికులకు విజ్ఞప్తి చేశారు.ఈరోజు తెల్లవారుజామున సత్తుపల్లిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు యువకులు మృతి చెందారని, పొగమంచు కారణంగా జరుగుతున్న రోడ్డు ప్రమాదాల దృష్టిలో పెట్టుకొని స్వల్ప నిర్లక్ష్యం పెద్ద ప్రమాదాలకు దారితీసే అవకాశం ఉందని అన్నారు. పొగమంచు కారణంగా రోడ్లపై ఎదురుగా వచ్చే వాహనదారులు పాదచారులను గమనించే సామర్థ్యం గణనీయంగా తగ్గి ప్రమాదాలు జరిగే అవకాశం ఉందన్నారు. ముఖ్యంగా వాహనాలను వేగంగా నడపకూడదని, ముందుగా వాహన పరిస్థితిని తనిఖీ చేసుకోవాలని, డ్రైవింగ్ సమయంలో సెల్ ఫోన్ మాట్లాడటం, అనుకోకుండా ఓవర్‌టేక్ చేయడం, ట్రాఫిక్ నియమాల ఉల్లంఘనలు వంటి ప్రమాదకర చర్యలు పూర్తిగా నివారించాలని సూచించారు.


