నిబద్ధత కలిగిన కమ్యూనిస్టు పోటు ప్రసాద్
ఆశయాన్ని ఆచరణలో చూపిన మహోన్నతుడు
వర్ధంతి సభలో బాగం హేమంతరావు
కాకతీయ, ఖమ్మం : నిబద్ధత గల కమ్యూనిస్టు పోటు ప్రసాద్ అని తుది శ్వాస వరకు పార్టీ విస్తరణ కోసం, పేదల అభ్యున్నతి కోసం కృషి చేశారని సీపీఐ జాతీయ సమితి సభ్యులు బాగం హేమంతరావు తెలిపారు. ఆయన నమ్మిన సిద్ధాంతాన్ని ఆచరణలో చూపిన మహోన్నతుడు అన్నారు. భారత కమ్యూనిస్టు పార్టీ నాయకుడు, సీపీఐ జిల్లా మాజీ కార్యదర్శి పోటు ప్రసాద్ ప్రథమ వర్ధంతి సభ గురువారం కార్యాలయంలో జరిగింది. ఎస్కె జానిమియా అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో హేమంతరావు మాట్లాడుతూ సాయుధ పోరాట వారోత్స కుటుంబంలో జన్మించిన పోటు ప్రసాద్ తుది శ్వాస వరకు అదే పంథాను కొనసాగించారన్నారు. విద్యార్థి దశలో విద్యార్థి సమస్యల పరిష్కారం కోసం ముఖ్యంగా ఖమ్మంలో పిజి కళాశాల సాధన కోసం జరిగిన విద్యార్థి ఉద్యమంలో పోటు ప్రసాద్ క్రియాశీలక భూమిక పోషించారని ఆయన తెలిపారు. సంక్లిష్ట పరిస్థితుల్లో పోటు ప్రసాద్ వర్ధంతి సభను జరుపుకుంటున్నామని ఒక పక్క కమ్యూనిస్టు పార్టీ శత వసంత సంబురాలు ఖమ్మంలో జరగబోతున్నాయని ఈ సమయంలో పోటు ప్రసాద్ లేని లోటు అడుగడుగునా కనిపిస్తుందన్నారు. అంతకు ముందు పోటు ప్రసాద్ చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
40వ డివిజన్లో…
సీపీఐ నాయకుడు పోటు ప్రసాద్ ప్రథమ వర్ధంతి సభను 40వ డివిజన్లో ఘనంగా నిర్వహించారు. ఆయన స్మారక స్థూపం వద్ద పార్టీ పతాకాన్ని సీపీఐ జిల్లా కార్యదర్శి దండి సురేష్ ఆవిష్కరించారు. స్తూపానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఇందిరా నగర్ పైలాన్ వద్ద పోటు ప్రసాద్ ప్రథమ వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వహించిన అన్నదాన కార్యక్రమాన్ని సీపీఐ నాయకులు ప్రారంభించారు. ఆయా కార్యక్రమాల్లో సీపీఐ జిల్లా కార్యదర్శి దండి సురేష్, సహాయ కార్యదర్శి జమ్ముల జితేందర్రెడ్డి, నాయకులు ఎన్కి జానిమియా, ఏపూరి లతాదేవి, పోటు కళావతి, పోటు నిర్మల. తాటి వెంకటేశ్వరరావు, పగడాల మల్లేష్, ఏనుగు గాంధీ, వరదా నర్సింహారావు, బండారుపల్లి నవీన్, సత్యనారాయణరెడ్డి, వెంకన్న, నాగేశ్వరరావు, ఏఐవైఎఫ్, ఏఐఎస్ఎఫ్ నాయకులు నానబాల రామకృష్ణ, ఇటికాల రామకృష్ణ, ఆముదాల వెంకన్న, జాకీర్, తాటి నిర్మల, అక్రమ్ తదితరులు పాల్గొన్నారు.


