మహిళల ఐక్యతకే ‘ఇందిరా మహిళా శక్తి’ చీరల పంపిణీ
మహిళల ఆత్మవిశ్వాసం, అభివృద్ధి మా ప్రభుత్వ లక్ష్యం
మంత్రి పొన్నం ప్రభాకర్
కాకతీయ, కరీంనగర్ : మహిళలను ఆర్థికంగా, సామాజికంగా ఉన్నత స్థానంలో నిలబెట్టడం పట్ల ప్రభుత్వం కట్టుబడి ఉందని రవాణా,బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. చిగురుమామిడి, సైదాపూర్ మండలాల్లో వరుసగా నిర్వహించిన ఇందిరా మహిళా శక్తి చీరల పంపిణీ కార్యక్రమాల్లో ఆయన పాల్గొని మహిళలతో ముచ్చటించారు. చీరల పంపిణీ కేవలం ఒక కార్యక్రమం కాదని, మహిళలు ఐక్యంగా ఉన్నారని తెలియజేసే ఒక సందేశమని పేర్కొన్నారు.చిగురుమామిడి మహాలక్ష్మి ఫంక్షన్ హాల్‌లో జిల్లా కలెక్టర్ పమేలా సత్పతితో కలిసి మంత్రి చీరలను అందజేశారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ మహిళా సంఘాల సూచనల మేరకే మోడల్ చీరలను ఎంపిక చేశామని చెప్పారు. గ్రామ, మండల సమాఖ్యల నాయకులు బాధ్యతగా వ్యవహరించి ప్రతి మహిళ చేతికి చీర అందేలా చూడాలని కోరారు. మహిళలు ఎదుర్కొనే సమస్యలన్నింటికీ ప్రభుత్వం వెంటనే స్పందించడానికి సిద్ధంగా ఉందని తెలిపారు.మహిళలు ఆర్థికంగా బలపడేందుకు ప్రభుత్వం చేపట్టిన చర్యలను వివరించిన మంత్రి, వడ్డీ లేని రుణాలపై వడ్డీ మొత్తాన్ని ప్రభుత్వం భరిస్తోందని, రైస్ మిల్లులు, సోలార్ ప్లాంట్లు, క్యాంటీన్లు, పెట్రోల్ బంకులు, బస్సుల కొనుగోలు వంటి పెద్ద వ్యాపారాల్లోనూ మహిళా సంఘాలకు అవకాశాలు కల్పిస్తున్నామని చెప్పారు. పిల్లల చదువు పట్ల శ్రద్ధ చూపిన కుటుంబాలే ఆర్థికంగా అభివృద్ధి చెందినట్లు ఇంటింటి సర్వేలో బయటపడిందని, అందుకే విద్యపై మహిళలు ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు.నియోజకవర్గానికి ఇప్పటివరకు 3,500 ఇండ్లు మంజూరయ్యాయని, మరో విడత ఇండ్ల కేటాయింపూ త్వరలో జరగనున్నట్లు తెలిపారు. మహిళా సంఘాల భవనాల నిర్మాణానికి కూడా ప్రభుత్వమే నిధులు కేటాయిస్తుందని వెల్లడించారు. అనంతరం లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి చెక్కులను అందజేశారు.కార్యక్రమంలో కలెక్టర్ పమేలా సత్పతి, అడిషనల్ కలెక్టర్ అశ్విని తానాజీ వాకడే, ఆర్డీఓ మహేశ్వర్, డీఆర్‌డీఓ శ్రీధర్, మార్కెట్ కమిటీ చైర్మన్ తిరుపతిరెడ్డి, మండల సమాఖ్య అధ్యక్షురాలు గందె రజిత పాల్గొన్నారు.సైదాపూర్‌లో మహిళలతో మంత్రి విశాల సహకార పరపతి సంఘం ఫంక్షన్ హాల్‌లో జరిగిన చీరల పంపిణీ కార్యక్రమానికి మంత్రి పొన్నం ప్రభాకర్ హాజరై మహిళలకు చీరలు అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఉచిత బస్సు, గృహలక్ష్మి, ధాన్యం కొనుగోలు కేంద్రాల బాధ్యత మహిళా సంఘాలకు అప్పగించడం వంటి కార్యక్రమాల ద్వారా ప్రభుత్వం ఇప్పటికే మహిళలకు గణనీయమైన చేయూతనిచ్చిందని చెప్పారు.18 ఏళ్లు నిండిన ప్రతి మహిళకు చీర అందేలా సంఘ సభ్యులు కృషి చేయాలని సూచించారు. ప్రతి మహిళ స్వయం సహాయక సంఘంలో చేరి ఆర్థిక స్వావలంబన సాధించాలని పిలుపునిచ్చారు. త్వరలో సైదాపూర్ మండలంలో ఉచిత ఆరోగ్య శిబిరాలు ఏర్పాటు చేసి క్యాన్సర్ నిర్ధారణ, కంటి పరీక్షలతో సహా మరెన్నో వైద్య సేవలను ఉచితంగా అందించనున్నట్లు ప్రకటించారు. ప్రజలు ఈ అవకాశాన్ని తప్పక వినియోగించుకోవాలని కోరారు. అనంతరం లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి చెక్కులను అందజేశారు. కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ అశ్విని తానాజీ వాకడే, డీఆర్‌డీఓ శ్రీధర్, వ్యవసాయ అధికారి భాగ్యలక్ష్మి, మార్కెట్ కమిటీ చైర్మన్ దొంత సుధాకర్, సంఘ చైర్మన్ కొత్త తిరుపతిరెడ్డి, మండల సమాఖ్య అధ్యక్షురాలు సంధ్యారాణి తదితరులు పాల్గొన్నారు.



