కాకతీయ, కొత్తగూడెం : డాక్టర్ మన్మోహన్ సింగ్ ఎట్ సైన్స్ యూనివర్సిటీ ప్రారంభోత్సవానికి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రానున్న నేపథ్యంలో ఏర్పాట్ల పురోగతిపై శుక్రవారం కలెక్టర్ జితేష్ పాటిల్ సమీక్షించారు. యూనివర్సిటీ ప్రాంగణం మొత్తం ముఖ్యమంత్రి పర్యటనకు అనుగుణంగా తీర్చిదిద్దే పనుల్ని కలెక్టర్ విభాగాల వారీగా పరిశీలిస్తూ అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా కలెక్టర్ ఆడిటోరియం, హాస్టల్ బ్లాక్, అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్ లు, అంతర్గత రహదారుల మరమ్మతు వంటి కీలక ప్రదేశాలను సందర్శించి పనుల పురోగతిపై ఇంజనీరింగ్ యూనివర్సిటీ అధికారుల నుండి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ముఖ్యమంత్రి పర్యటన సమయం దగ్గరపడుతున్న నేపథ్యంలో ప్రతీ పని వేగంగా పూర్తి చేయాలని కలెక్టర్ సూచించారు.
ఆలస్యానికి కారణమయ్యే అంశాలు ఏవైనా ఉంటే వెంటనే నివేదించాలని తక్షణమే పరిష్కార చర్యలు చేపట్టాలని ఆయన ఆదేశించారు. యూనివర్సిటీ మొత్తం పరిశుభ్రత పచ్చదన సదుపాయాలపై ప్రత్యేక దృష్టి సారిస్తూ ప్రతి విభాగాన్ని అందంగా మార్చేందుకు ఎంపీడీవోలను ప్రత్యేక విభాగాలకు కలెక్టర్ నియమించారు. గ్రౌండ్ లెవెలింగ్, మొక్కలు నాటడం, రోడ్ల పక్కన హార్టికల్చర్ పనులు, చెత్త తొలగింపు వంటి సుందరీకరణ కార్యక్రమాలు తక్షణమే పూర్తి చేయాలని ఆదేశించారు. పరిశీలనలో కలెక్టర్ వెంట స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విద్యా చందన, జడ్పీ సీఈవో నాగలక్ష్మి, ఎర్త్ సైన్స్ యూనివర్సిటీ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ జగన్మోహన్ రాజు, మున్సిపల్ కమిషనర్ సుజాత, డిపిఓ అనూష, పంచాయతీరాజ్ ఈఈ శ్రీనివాస్, ఎంపీడీవోలు కళాశాల ఉపాధ్యాయులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.


