సజావుగా పంచాయతీ ఎన్నికల నిర్వహణకు సన్నద్ధంగా ఉండాలి
రాష్ట్ర ఎన్నికల సంఘం కమీషనర్ రాణి కుముదిని
3 విడతల్లో పంచాయతీ ఎన్నికల నిర్వహణకు ప్రణాళికలు సిద్ధం
గ్రామపంచాయతీ ఎన్నికల సన్నద్ధతపై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించిన ఎన్నికల సంఘం కమీషనర్
కాకతీయ, ఖమ్మం ప్రతినిధి: గ్రామపంచాయతీ ఎన్నికలను సజావుగా నిర్వహించేందుకు అధికారులు అవసరమైన ఏర్పాట్లు పూర్తి చేసి, సన్నద్ధంగా ఉండాలని రాష్ట్ర ఎన్నికల సంఘం కమీషనర్ ఐ. రాణి కుముదిని అన్నారు.
గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణ, ఓటర్ జాబితా తయారీపై రాష్ట్ర ఎన్నికల సంఘం కమీషనర్, జిల్లా కలెక్టర్లతో గురువారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. హైదరాబాద్ నుండి జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి పాల్గొనగా, కలెక్టరేట్ నుంచి పోలీస్ కమీషనర్ సునీల్ దత్, అదనపు కలెక్టర్ డాక్టర్ పి. శ్రీజ లతో కలిసి పాల్గొన్నారు.ఈ సందర్భంగా రాష్ట్ర ఎన్నికల సంఘం కమీషనర్ రాణి కుముదిని మాట్లాడుతూ గ్రామ పంచాయతీ ఎన్నికలు త్వరలో నిర్వహణకు ప్రభుత్వం నిర్ణయించిందని, సజావుగా ఎన్నికలు జరిగేలా జిల్లా యంత్రాంగం చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని అన్నారు. 3 విడతల్లో పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలను కుంటే, ప్రతి ఫేజ్ లో ఏ మండలాలు ఎన్నికలు జరగాలో జిల్లా వారీగా ప్రణాళికలు అందించాలని అన్నారు.

పంచాయతీ తుది ఓటర్ జాబితాకు సంబంధించి ఫిర్యాదులు, అభ్యంతరాలను స్వీకరించి పరిష్కరించి, ప్రతి గ్రామ పంచాయతీకి సంబంధించి పోలింగ్ కేంద్రాలు, ఫోటోలతో కూడిన ఓటర్ జాబితా ప్రచురణకు చర్యలు తీసుకోవాలని అన్నారు.
ఎన్నికల షెడ్యూల్ విడుదలైన తర్వాత ఎంసిసి నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని అన్నారు. ఎంసిసి ఉల్లంఘనపై వచ్చే ప్రతి ఫిర్యాదు పరిష్కారానికి యంత్రాంగం సిద్ధం చేసుకోవాలని అన్నారు.
వీడియో కాన్ఫరెన్స్ అనంతరం స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ డాక్టర్ పి.శ్రీజ అధికారులతో మాట్లాడుతూ గ్రామ పంచాయతీ, వార్డులకు సంబంధించి రిజర్వేషన్ ప్రక్రియ ఖరారు చేసి చెక్ చేసుకోవాలని, ప్రతి వర్గంలో మహిళలకు రిజర్వేషన్ 50 శాతం అమలు కావాల్సి ఉంటుందని అన్నారు.
ఈ సమావేశంలో జెడ్పీ సిఈఓ దీక్షా రైనా, జిల్లా పంచాయతి అధికారి ఆశాలత, జెడ్పి డిప్యూటీ సిఇఓ నాగపద్మజ, డివిజనల్ పంచాయతీ అధికారులు విజయలక్ష్మి, రాంబాబు, ఎన్నికల విభాగం సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.



