కాకతీయ, బయ్యారం: పిఓడబ్ల్యూ ప్రగతిశీల మహిళా సంఘం రాష్ట్ర కమిటీ సమావేశం ను మండల కేంద్రము లోని సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ పార్టీ కార్యాలయంలో సోమవారం నిర్వహించారు.ఈ సమావేశంలొ దేశ వ్యాప్తంగా,తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న అనేక కార్యక్రమాల గురించి చర్చించి,భవిష్యత్ నిర్ణయాలు తీసుకున్నారు.
ఈ సమావేశ అనంతరం జరిగిన ప్రెస్ మీట్ లో రాష్ట్ర అధ్యక్షులు అనసూయ,ప్రధాన కార్యదర్శి అందె మంగ మాట్లాడుతూ, ఇటీవల కాలంలో దేశవ్యాప్తంగా తెలంగాణ రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న హింస దౌర్జన్యాలు ,పరువు హత్యలు పెరిగిపోయాయని, కర్ణాటకలోని ధర్మస్థలలో వందలాది మహిళలను హత్యలు చేసిఖననం చేసిన విషయాలలో సత్యాలను వెలికి తీసి దోషులను శిక్షించాల్సిందిగా,కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేశారు.
అడపాదడపా జరిగే చిన్నా చితకా విషయాలపై గొంతు చించుకొనే సోకాల్డ్ హిందూ భక్తులు ధర్మస్థల దుర్మార్గంపై నోరు మెదపటం లేదన్నారు.దేశ చరిత్రలోనే మునుపెన్నడూ జరగనంతటి ఘోరం ధర్మస్థల ఘటన ద్వారా బయటపడినా ప్రభుత్వాలు తగిన విధంగా స్పందించటంలేదని అన్నారు. ధర్మస్థల అత్యాచారాలు,హత్యలపై సమగ్ర విచారణ జరిపి దోషులను బయటకు లాగకపోతే పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహిస్తామన్నారు.
మహిళల స్వయం నిర్ణయాధికార హక్కుపై వివిధ కార్యక్రమాలను ఏర్పాటు చేయాలని,ఈ విషయంలో మహిళలకు,కుటుంబాలకు అవగాహన కల్పించాలని కోరారు.భారత రాజ్యాంగం ప్రసాదించిన స్వేచ్ఛ హక్కు,జీవించే హక్కులను పరిరక్షించాలని వారు కోరారు.ఈ కార్యక్రమంలో పిఓడబ్ల్యు జాతీయ అధ్యక్షులు జి.ఝాన్సీ,పిఓడబ్ల్యూ రాష్ట్ర నాయకులు ఊకే పద్మ,తిరుపతమ్మ,ఆర్.సీత,అనురాధ,ఎండి కవిత,నర్సమ్మ,లక్ష్మమ్మ, జానకి తదితరులు పాల్గొన్నారు.


