ఏసీబీ వలలో ఇద్దరు ప్రభుత్వ ఉద్యోగులు, రేషన్ షాప్ డీలర్
కాకతీయ, ఇల్లందు: భద్రాద్రికొత్తగూడెం జిల్లా ఇల్లందు పట్టణంలో సోమవారం ఏసీబీ అధికారులు సివిల్ సప్లయ్ అధికారులను అదుపులోకి తీసుకున్నారు. ఏసీబీ డి.ఎస్.పి తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. స్థానిక రేషన్ షాప్ డీలర్ వద్దనుండి రూ.30 వేలు అవినీతికి పాల్పడడంతో ఇల్లందు సివిల్ సప్లై డిటి మహమ్మద్ యాకూబ్ పాషా, ఆపరేటర్ విజయ్ తో సహా రేషన్ డీలర్స్ సంఘం అధ్యక్షులు శబరిస్ ను అవినీతి నిరోధక డిఎస్పి వై రమేష్ అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు.పట్టణంలోని ఓ రేషన్ షాపులో తనిఖీకి వెళ్ళిన డిటి యాకూబ్ పాషా, కంప్యూటర్ ఆపరేటర్ విజయ్ లు స్టాక్ తక్కువగా ఉండడంతో కేస్ మాఫ్ చేయడం కోసం రూ.30 వేలు లంచం ఇవ్వాల్సిందిగా ఆదేశించారు. అయితే పైకాన్ని రేషన్ షాప్ డీలర్స్ అధ్యక్షుడు శబరీష్ కు ఇవ్వాలని సూచించారు. చేసేది ఏమీ లేక ఆ డీలర్ ఏసీబీ అధికారులను సంప్రదించగా ఉద్యోగులు ఇవ్వమన్న చొట డబ్బు ఇవ్వమని ఆదేశించారు. వారి సూచనల మేరకు జగదాంబ సెంటర్లో శబరిస్ నడుపుతున్న సెల్ షాప్ వద్దకు వెళ్లి ఆ డీలర్ డబ్బు ఇస్తుండగా ఏసీబీ డి.ఎస్.పి రమేష్ తన బృందంతో వెళ్లి రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. అనంతరం శబరిసను స్థానిక తహసిల్దార్ కార్యాలయానికి తీసుకువెళ్లి విచారించగా డిటి యాకూబ్ పాషా, ఆపరేటర్ విజయ్ లు డీలర్ ఇచ్చిన ఆ డబ్బు తీసుకొని తమకు ఇవ్వాలని చెప్పినట్లు శబరి అధికారులకు వివరించారు.
ఉద్యోగులు లంచం అడిగితే టోల్ ఫ్రీ నెంబర్ 1064 కు తెలియజేయండి
-అవినీతి నిరోధక శాఖ డిఎస్పి వై. రమేష్
ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైనా సరే పనులు చేసేందుకు లంచం అడిగితే వెంటనే తెలియజేయాలని అవినీతి నిరోధక శాఖ డిఎస్పి వై రమేష్ తెలిపారు. అవినీతి అధికారు కబంధహస్తాల నుండి అమాయక ప్రజలను కాపాడేందుకే శాఖ ఉన్నదని, సమాచారం తెలియజేసిన వారి పేర్లను వివరాలను గోప్యంగా ఉంచుతామన్నారు. నిర్భయంగా తమకు జరిగిన అన్యాయం గురించి టోల్ ఫ్రీ నెంబర్ 10 64 కు తెలియజేసినచో వారికి కొన్ని సూచనలు ఇచ్చి న్యాయం చేస్తామని అన్నారు.


