జోరుగా ఇసుక దందా
ప్రభుత్వ ఆదాయానికి గండి
కాకతీయ,కారేపల్లి : మండలంలో ఇసుక దందా భారీగా నడుస్తుంది. పక్క జిల్లా నుండి మండలానికి పెద్ద ఎత్తున అనుమతులు లేకుండా భారీగా దందా చేస్తున్నారు. కొందరు అధికార పార్టీకి చెందిన నాయకుల కనుసైగల్లో నడుస్తుంది.అక్రమ ఇసుక రవాణా యథేచ్ఛగా సాగుతున్న నియంత్రించాల్సిన అధికారులు అక్రమార్కుల వద్ద నుండి భారీగా ముడుపులు తీసుకుంటున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. వాగులు, వంకల్లో ఇష్టానుసారంగా ఇసుక తోడేస్తున్నారు.పగలు రాత్రి తేడా లేకుండా ట్రాక్టర్లలో ఇసుక రవాణా జరుగుతోంది.పర్యావరణానికి ముప్పు తప్పదని తెలిసినా వాల్టా చట్టాన్ని తుంగలో తొక్కుతూ ట్రాక్టర్లలో ఇసుక రవాణా చేస్తూ అక్రమార్కులు రూ.లక్షలు సొమ్ము చేసుకుంటున్నారు.ఇల్లందు నియోజకవర్గంలోని టేకులపల్లి మండలంలో అనిశెట్టిపల్లి నుంచి కొనసాగిస్తున్న అక్రమ ఇసుక దందా కారేపల్లికి చేరుతోంది.రెవెన్యూ, మైనింగ్, ఫారెస్ట్, అధికారులు అక్రమాల పట్ల చూసి చూడనట్లు వ్యవహరించడం పట్ల పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అధికార పార్టీకి చెందిన నాయకుల అండతోనే ఇసుక రవాణా జరుగుతోందని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రతిరోజు తెల్లవారుజామున పదుల సంఖ్యలో ఉసుక ట్రాక్టర్లు రావడంతో రోడ్లు కూడా గుంటల మయంగా మారుతున్నాయి.రూ.8500 రూపాయలకు ఒక ట్రిప్పు చొప్పున ఇసుక విక్రయిస్తున్నారనే ఆరోపణలు వినవస్తున్నాయి.ఇందిరమ్మ ఇల్లు పేరిట అక్రమ ఇసుక రవాణా నడుపుతూ అక్రమ మార్గాన ఆదాయాన్ని సమకూర్చుకుంటున్నారు.
ఇన్ఫార్మర్ వ్యవస్థతో అక్రమ దందా గురించి సమాచారం తెలుసుకుని అందినంత దండుకుంటున్నారని కూడా విమర్శలు వస్తున్నాయి. ఏదేమైనా సంబంధిత అధికారులు స్పందించి అక్రమ ఇసుక రవాణాను అడ్డుకుని నిజమైన పేద ఇందిరమ్మ లబ్ధిదారులకు న్యాయం చేయాలని మండల ప్రజలు కోరుకుంటున్నారు.


