ఆయిల్ పామ్ సాగుతో రైతులకు లాభాల పంట…
రాష్ట్ర వ్యవసాయ,మార్కెటింగ్, సహకార, చేనేత జౌళి శాఖల మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వర రావు
జనవరి -2026 లో ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ ట్రయల్ రన్ నిర్వహించాలి
కేంద్ర ప్రభుత్వం దిగుమతి విధానాలతో రైతులకు నష్టం
కాకతీయ, ఖమ్మం ప్రతినిధి: ఆయిల్ పామ్ సాగుతో రైతులకు లాభాల పంట పండుతుందని రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్, సహకార, చేనేత జౌళి శాఖల మంత్రి తుమ్మల నాగేశ్వర రావు తెలిపారు.మంత్రి శుక్రవారం కొణిజెర్ల మండలం అంజనాపురంలో ఏర్పాటు చేస్తున్న గోద్రెజ్ ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ పనులను క్షేత్ర స్థాయిలో పరిశీలించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఖమ్మం జిల్లాలో 6 మండలాలు, కొత్తగూడెం జిల్లాలో 4 మండలాల పరిధిలో విస్తృతంగా ఆయిల్ పామ్ పంట సాగు అవుతున్నందున గోద్రెజ్ ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ నిర్మాణం జరుగుతుందని, ఎట్టి పరిస్థితుల్లో జనవరి 2026 లో ట్రయల్ రన్ జరిగేలా చూడాలని అన్నారు. ఏర్పాటు పనులు 2 షిప్టులలో జరగాలని మంత్రి ఆదేశించారు.

ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ వల్ల ప్రత్యక్షంగా 200, పరోక్షంగా 700 మందికి ఉపాధి లభిస్తుందని అన్నారు. గోద్రెజ్ కంపెనీ రిఫైనింగ్ ఫ్యాక్టరీ కూడా ఇక్కడ ఏర్పాటు చేస్తామని అన్నారు. గోద్రెజ్ కంపెనీ తో సీడ్ గార్డెనింగ్ ఏర్పాటు కూడా సీఎం రేవంత్ రెడ్డి ఎంఓయూ కుదుర్చుకోవడం జరిగిందని, దానికి సంబంధించిన భూమి త్వరలోనే అప్పగించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.
భారతదేశం ఇప్పటికే 97 శాతం పైగా ఆయిల్ ఇతర దేశాల నుంచి దిగుబడి చేసుకుంటుందని అన్నారు. రైతులు ఎటువంటి సంకోచం లేకుండా ఆయిల్ పామ్ పంట సాగు ప్రారంభించాలని అన్నారు.
కేంద్ర ప్రభుత్వం దిగుమతి విధానాలతో రైతులకు నష్టం జరుగుతున్నదని, ఆయిల్ పామ్ పంటకు కేంద్ర ప్రభుత్వం కనీస మద్దతు ధర ప్రకటించాలని అన్నారు. రాబోయే 3 సంవత్సరాలలో దేశంలోనే అత్యధికంగా ఆయిల్ పామ్ రాష్ట్రంలో సాగు అవుతుందని అన్నారు. సిద్దిపేటలో 125 టన్నుల సామర్థ్యంతో ఫ్యాక్టరీ నిర్మాణం పూర్తయి, వినియోగంలో ఉందని తెలిపారు.పెద్దపల్లిలో తిరుమల ఆయిల్ కంపెనీ నిర్మించే ఫ్యాక్టరీ జనవరి 2026, వనపర్తి లో నిర్మాణం జరిగే ఫ్యాక్టరీ ఫిబ్రవరి 2026, సత్తుపల్లి లో ఆయిల్ ఫెడ్ నిర్మిస్తున్న ఫ్యాక్టరీ జూన్ 2026 నాటికి సిద్ధం అవుతాయని, రాబోయే సంవత్సరంలో దాదాపు 7 ఆయిల్ ఆయిల్ పామ్ ఫ్యాక్టరీలు ప్రారంభం అవుతాయని అన్నారు. రాష్ట్రంలో 14 ప్రయివేటు, 7 ఆయిల్ ఫెడ్ ద్వారా ఫ్యాక్టరీలు ఉన్నాయన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం 2 లక్షల 75 వేల ఎకరాల్లో ఆయిల్ పామ్ సాగు ఉందని, వచ్చే సంవత్సరం మరో 3 లక్షల ఎకరాలకు ఆయిల్ పామ్ సాగు విస్తీర్ణం జరగాలని అన్నారు. 3 సంవత్సరాల క్రితం పంట వేసిన రైతులకు నేడు పంట దిగుబడి ప్రారంభమైందని, దీనిని పరిశీలించి ఇతర రైతులు కూడా ఆయిల్ పామ్ పంట వైపు దృష్టి సారించాలని అన్నారు. గిరిజన ప్రాంతాలలో సోలార్ సిస్టం తో ఆయిల్ పామ్ పంట వేసుకునేలా కృషి చేస్తున్నామని అన్నారు.అన్నింటికంటే చవక, అన్నింటికంటే ఆరోగ్యవంతమైంది పామాయిల్ అని, ఇతర పంటల కంటే ఆదాయం ఎక్కువని మంత్రి అన్నారు. ఆకాలవర్షాలు, రాళ్ళవానలు, చీడపీడల వల్ల ఇబ్బందులు రావని, కోతులు, అడవి పందుల భయం ఉండదని, మందులు, సాగు ఖర్చు తక్కువని తెలిపారు. స్థానిక నేతలు, అధికారులు రైతుల్లో అవగాహన కల్పించి, సాగుకు మల్లేలా ప్రోత్సహించాలని అన్నారు.
ఈ కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ డాక్టర్ పి. శ్రీజ, రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వరరావు, డిసిసిబి చైర్మన్ దొండపాటి వెంకటేశ్వరరావు, ఖమ్మం మార్కెట్ కమిటీ చైర్మన్ హన్మంతరావు, జిల్లా ఉద్యానవన అధికారి మధుసూదన్, జిల్లా వ్యవసాయ అధికారి పుల్లయ్య, జిల్లా సహకార అధికారి గంగాధర్, ఖమ్మం ఆర్డీవో నర్సింహారావు, డివిజనల్ పంచాయతీ అధికారి రాంబాబు, వివిధ శాఖల అధికారులు, ప్రజా ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.



