టీబీ వ్యాధి పై ప్రతి ఒక్కరికి అవగాహన ఉండాలి
డాక్టర్ దుర్గాభవాని
కాకతీయ, పినపాక: ప్రతిఒక్కరూ టీబీ వ్యాధిపై అవగాహన కలిగి ఉండాలని డాక్టర్ దుర్గ భవాని అన్నారు. మండల పరిధిలోని పినపాక ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో జిల్లా వైద్య అధికారులు ఆదేశాల మేరకు టీబీ అలెర్ట్ ఇండియా ఎన్జీఓ బట్టు వెంకటేశ్వర్లు పర్యవేక్షణలో క్షయవ్యాధి నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 2025 కల్లా క్షయవ్యాధి అంతం చేయాలనే కార్యక్రమంలో భాగంగా టీబీపై ఈ కార్యక్రమాన్ని ప్రత్యేకంగా నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. టీబీ రహిత సమాజం కోసం అందరూ కృషిచేయాలని కోరారు. క్షయ (టీబీ) ముఖ్యంగా ఊపిరితిత్తులను ప్రభావితం చేస్తుందన్నారు.దీనిని పల్మనరీ టీబీ అంటారని తెలిపారు. ఇది ఊపిరితిత్తులతో పాటు, శరీరంలోని ఇతర భాగాలను కూడా ప్రభావితం చేస్తుందని దీనిని ఎక్స్‌ట్రాపుల్మనరీ టీబీ అని పిలుస్తారన్నారు. ఈ లక్షణాలు కనిపించిన వారికి ప్రభుత్వం పౌష్టిక ఆహారం కోసం సంవత్సరం పాటు ప్రతినెలా ఒక వెయ్యి రూపాయలు అందిస్తుంది అని తెలిపారు. క్షయ వ్యాధి నివారణకు టీకాలు వేయించుకోవడమే కాకుండా క్రమం తప్పకుండా స్క్రీనింగ్ చేయించుకోవాలన్నారు. ఇన్ఫెక్షన్ నియంత్రణ పద్ధతులను అనుసరించి టీబీ సోకిన వ్యక్తులతో సన్నిహిత సంబంధాన్ని పరిమితం చేయాలన్నారు.పోషక ఆహారం తీసుకుంటూ, వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలన్నారు. ఈ కార్యక్రమంలో టీబీ అలెర్ట్ ఇండియా ఎన్జీఓ బట్టు వెంకటేశ్వర్లు, సూపర్వైజర్ ప్రేమ్ కుమార్, టీవీ ఎక్స్రేరే ఆఫీసర్ సాయి కృష్ణ, ఆరోగ్య సిబ్బంది పాల్గొన్నారు.


