భూ సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు…
జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి
రెవెన్యూ సదస్సుల భూ సమస్యల పరిష్కారంపై
వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన జిల్లా కలెక్టర్
కాకతీయ, ఖమ్మం ప్రతినిధి: రెవెన్యూ భూ సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి సంబంధిత అధికారులను హెచ్చరించారు.
రెవిన్యూ సదస్సు దరఖాస్తుల పరిష్కారంపై అదనపు కలెక్టర్ పి. శ్రీనివాస రెడ్డి తో కలిసి, శుక్రవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సంబంధిత అధికారులతో సమీక్షించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి మాట్లాడుతూ ప్రజలకు ఉన్న భూ సమస్యల పరిష్కారంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని, భూ భారతి దరఖాస్తులు, పెండింగ్ సాదా బైనామా , రెవెన్యూ సదస్సు దరఖాస్తులు యుద్ద ప్రాతిపదికన పరిష్కరించాలని ఆదేశించారు.గతంలో పలు మార్లు సమావేశాలు నిర్వహించి సూచనలు చేసినప్పటికీ కొన్ని మండలాల్లో ఆశించిన పురోగతి లేదని అన్నారు. పెండింగ్ దరఖాస్తుల పరిష్కారం వరకు సెలవుల్లో కూడా అధికారులు పూర్తి స్థాయిలో పని చేయాలని కలెక్టర్ ఆదేశించారు. రెవెన్యూ సమస్యల పరిష్కారంలో అలసత్వం వహిస్తే చర్యలు చేపట్టనున్నట్లు కలెక్టర్ హెచ్చరించారు. ఆన్ లైన్ లో ఉన్న సాదా బైనామా దరఖాస్తుల పరిశీలన వెంటనే ప్రారంభించాలని, డెస్క్ పరిశీలన ద్వారా అనర్హుల దరఖాస్తులను తిరస్కరించి ఆర్డిఓకు ఫార్వార్డ్ చేయాలని అన్నారు. నిబంధనల ప్రకారం అర్హత ఉన్న దరఖాస్తులకు జి.పి.ఓ., ఆర్.ఐ, సర్వేయర్ ద్వారా క్షేత్రస్థాయి పరిశీలన చేయాలని కలెక్టర్ ఆదేశించారు. సాదా బైనామా దరఖాస్తులలో అమ్మకందారుల రికార్డ్ సరిగ్గా లేకపోతే తిరస్కరించాలని, ప్రభుత్వ భూములు, నాలాలు, చెరువు ఎఫ్.టి.ఎల్., బఫర్ జోన్ పరిధిలో భూముల పట్టా కోసం సాదా బైనామా దరఖాస్తులు వస్తే నేరుగా తిరస్కరించవచ్చని, వీటిని డెస్క్ పరిశీలన ద్వారా గుర్తించాలని, ఈ ప్రక్రియ ప్రతి మండలంలో ఆదివారం నాటికి పూర్తి చేయాలని అన్నారు.
ప్రతి భూ సమస్య దరఖాస్తు సంబంధించి తిరస్కరిస్తే కారణాలు స్పష్టంగా తెలియజేస్తూ ఆన్ లైన్ లో నమోదు చేయాలని అన్నారు. మండలాలను ఆకస్మికంగా తనిఖీ చేసే సమయంలో తిరస్కరించిన దరఖాస్తులను ర్యాండంగా చెక్ చేయడం జరుగుతుందని అన్నారు.
రెవెన్యూ సదస్సులలో వచ్చిన సాదా బైనామా దరఖాస్తులు, అసైన్మెంట్ దరఖాస్తులు పక్కన పెట్టి మిగిలిన 16 వేల దరఖాస్తులను ప్రాధాన్యత క్రమంలో పరిష్కరించాలని కలెక్టర్ తెలిపారు.
సమీక్ష లో అదనపు కలెక్టర్ పి. శ్రీనివాస రెడ్డి మాట్లాడుతూ ప్రతి మండల పరిధిలో 2 నుంచి 3 బయోమెట్రిక్ డివైజ్ లు పెట్టుకొని త్వరగా పెండింగ్ దరఖాస్తుల స్క్రూటినీ పూర్తి చేయాలని అన్నారు.
అనంతరం మండలాల వారీగా సాదా బైనామా, రెవెన్యూ సదస్సులు దరఖాస్తుల స్క్రూటినీ సమీక్షిస్తూ పలు సూచనలు చేశారు. ఈ వీడియో సమావేశంలో కల్లూరు నుండి సబ్ కలెక్టర్ అజయ్ యాదవ్, వివిధ మండలాల నుండి తహసీల్దార్లు, కలెక్టరేట్ ఏఓ. కె. శ్రీనివాసరావు, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.



