ఇందిరమ్మ ప్రభుత్వం… పేదల నేస్తం!
పాలేరు రిజర్వాయర్‌లో చేప పిల్లల విడుదల
రాబోయే రోజుల్లో రొయ్య పిల్లల పంపిణీ చేస్తాం..
మంత్రి పొంగులేటి భరోసా
కాకతీయ, ఖమ్మం ప్రతినిధి : పేదల పక్షపాతిగా ఇందిరమ్మ ప్రభుత్వం పని చేస్తోందని తెలంగాణ రెవెన్యూ, గృహనిర్మాణ, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి అన్నారు. గురువారం కూసుమంచి మండలంలోని పాలేరు గ్రామ రిజర్వాయర్‌లో చేప పిల్లలను మంత్రి విడుదల చేశారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ… ప్రజల ఆశీర్వాదంతో తెలంగాణలో ఇందిరమ్మ ప్రభుత్వం ఏర్పడి 22 నెలలుగా పేదల సంక్షేమమే ప్రధాన లక్ష్యంగా పాలన సాగిస్తోందని చెప్పారు. పేదల జీవనోపాధి కష్టాలపై దృష్టిపెట్టి ప్రభుత్వం అనేక పథకాలను అమలు చేస్తోందని పేర్కొన్నారు.
మత్స్యకార సోదరుల అభ్యర్థన మేరకు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 101 మీడియం, మేజర్ రిజర్వాయర్లలో పెద్దసైజు రొయ్య పిల్లలను రాబోయే 15 రోజుల్లో విడుదల చేయనున్నట్లు తెలిపారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో అతి పెద్ద ప్రాజెక్టుగా ఉన్న పాలేరు రిజర్వాయర్‌లో ఇప్పటికే రెండు సార్లు చేప పిల్లల విడుదల చేసినట్లు గుర్తుచేశారు. ఆర్భాటాలకు కాకుండా, ప్రతి రూపాయి ప్రజల సంక్షేమానికే వినియోగించే విధంగా ఇందిరమ్మ ప్రభుత్వం పని చేస్తోందని మంత్రి స్పష్టం చేశారు.
తరువాత కూసుమంచి క్యాంపు కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో 90 మంది లబ్ధిదారులకు రూ.37 లక్షల 97 వేల 500 విలువైన సీఎంఆర్‌ఎఫ్ చెక్కులను మంత్రి అందజేశారు.ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ పి. శ్రీనివాస్ రెడ్డి, రాష్ట్ర మత్స్య సహకార సంఘాల సమాఖ్య చైర్మన్ మెట్టు సాయి కుమార్, ఖమ్మం ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్, తహసిల్దార్ రవికుమార్, ఎంపిడీఓ, ప్రజా ప్రతినిధులు, మత్స్యకార సంఘాల నాయకులు పాల్గొన్నారు.



