వర్తక సంఘంపై ఎందుకు ఇంత ప్రేమ
ఏ వ్యాపారం నిర్వహించకుండానే అధ్యక్ష పదవి పోటీకి
చిట్ ఫండ్ వ్యాపారం పెంచుకునేందుకు ఎత్తు గడన
మరో నాలుగురోజుల్లో ఎన్నికలు
కాకతీయ, ఖమ్మం ప్రతినిధి: ఖమ్మం వర్తక సంఘంపై కొంతమంది ఎనలేని ప్రేమను వలకబోయడం వెనక పెద్ద కారణాలే ఉన్నట్లుగా వర్తకులు చెప్పుకుంటున్నారు. అసలు వర్తక సంఘంలో సభ్యుడిగా చేరాలంటే సంఘ నిబంధనల ప్రకారం దిగుమతి, కాన్వాసింగ్ శాఖల్లో లైసెన్సు కలిగి ఉన్న వ్యాపారి నేరుగా ఆ సంఘ సభ్యుడిగా చలామణి అవుతాడు. అదేవిధంగా మిగిలిన ఏ శాఖలోనైనా జీఎస్టీ లైసెన్స్ పొందిన వ్యాపారి ఇప్పటికీ ఆ వ్యాపారం నిర్వహిస్తూ ఉంటేనే వర్తక సంఘ సభ్యుడు అవుతారు. కానీ ఇవేమీ తెలియని వ్యక్తి 12 ఏళ్ల క్రితం అల్యూమినియం అనే వ్యాపార జీఎస్టీ లైసెన్సును ప్రస్తుతం చూపిస్తూ ఏకంగా అధ్యక్షుడు పోటీకి నిలబడుతున్నట్లు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. టెక్నికల్గా జనరల్ మనియార్ శాఖలో సభ్యుడిగా చూపించుకుంటూ ప్రస్తుతం వ్యాపారం నిర్వహించకపోయినా అధ్యక్ష పోటీకి అర్హత పొందడంపై పలువురు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. చాంబర్ ఆఫ్ కామర్స్ చరిత్రలో ఏళ్లకు తరబడి ఎన్నికలు జరుగుతున్న ఎప్పుడు ఈ సంఘంలో ఒక వర్తక కులం ఉండేదే తప్ప మరె కులానికి తావుండదని సభ్యులు చెప్పుకుంటున్నారు. ప్రస్తుతం జరిగే ఎన్నికల్లో మాత్రం వాళ్ల స్వార్థం కోసం కులాలుగా వర్తకులను విభజించి ఓట్లను రాబట్టుకునేందుకు ప్రయత్నాలు జరపడం సమంజసం కాదని కొందరు సీనియర్ సభ్యులు వాపోతున్నారు. మరో నాలుగు రోజుల్లో జరగనున్న సంఘ ఎన్నికల్లో గెలుపు కోసం సభ్యులకు కొత్త వరవడి చూపించి వారికి మందు విందులు ఇవ్వడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. సెంట్రల్ అధ్యక్ష పదవికి పోటీ చేయడం పట్ల తన సొంత వ్యాపారాలను పెంచుకునేందుకే అడ్డదారుల్లో పోటీ చేస్తున్నట్లు తెలుస్తుంది. ఇప్పటికే తాను ఓ చిట్ఫండ్ కంపెనీని నెలకొల్పి పదుల సంఖ్యలో ఉన్న కస్టమర్లను వందల సంఖ్యలోకి పెంచుకునేందుకు ఈ వర్తక సంఘ అధ్యక్ష పదవి ఉపయోగపడుతుందనే లక్ష్యంతో ఎన్నికల్లో పోటీ చేస్తున్నట్లు విమర్శలు లేకపోలేదు. గత ప్రభుత్వం హయాంలో తాను మాజీ మంత్రి కి ప్రధాన అనుచరునని చెప్పుకుంటూ కొంత చీకటి సామ్రాజ్యాన్ని కూడా ఏర్పాటు చేసుకున్నట్లు వార్తలు వినపడుతున్నాయి. మార్కెట్లో కానీ వర్తక సంఘ మిగిలిన 17 శాఖల్లో సంబంధాలు కూడా అంతంత మాత్రమే ఉన్నప్పటికీ సభ్యులపై పెత్తనం చెలాయించేందుకు గెలుపే పరమావధిగా అడ్డదారులతోక్కుతున్నట్లు ఆరోపణలు వినబడుతున్నాయి. మరో నాలుగు రోజుల్లో ఎన్నికలు జరగనుండడంతో ఇప్పటికే ఎన్నికల అధికారి బి రాఘవులు ఆధ్వర్యంలో ప్రతి సభ్యుడికి ఓటు గుర్తింపు కార్డు అందజేయడం జరిగింది. గుర్తింపు కార్డు లేని వారు ఎన్నికల్లో ఓటు వినియోగించకుండా పగడ్బందీగా వ్యవహరిస్తున్నట్లు తెలుస్తుంది.1305 మంది సభ్యులు ప్రస్తుతం సెంట్రల్ బాడీ తో సహా దిగుమతి, మిర్చి, వెండి బంగార శాఖలకు తమ ఓట్లను వినియోగించుకోవచ్చు.


