అనుమతులు ఉన్నట్లా లేనట్లా
ఖమ్మం నగరంలో యదేచ్చగా మట్టి తవ్వకాలు
ప్రభుత్వ పనుల పేరుతో ప్రయివేటు గా అమ్మకాలు
మైనింగ్ అధికారుల తీరుపై అనుమానాలు
కోర్టు వివాదాల్లో ఉన్న భూమి కి ఎలా అనుమతిస్తారు
కాకతీయ, ఖమ్మం ప్రతినిధి : ఖమ్మం నగరంలో స్థానిక శ్రీనివాస్ నగర్ లో సర్వే నెంబర్ 443లో ఉన్న ఎర్రమట్టిగుట్టను కొందరు తోడేస్తున్నారు. అసలు ఈ గుట్ట తవ్వకాలకు మైనింగ్ అధికారుల అనుమతులు ఉన్నట్లా లేనట్ల అనే అనుమానాలు తలెత్తుతున్నాయి. సుమారు 20 అడుగులు ఎత్తు 11 ఎకరాలకు పైగా విస్తీర్ణం కలిగి ఉన్న భూమిలో మట్టి తవ్వకాలు జరుగుతున్న మైనింగ్ అధికారులు పట్టించుకోవడంలేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ భూమి పై గత కొన్ని ఏళ్లుగా కోర్టులో కేసు నడుస్తుండడంతో ఎవరు కూడా ఇప్పటివరకు ఆ గుట్టను కదిలించేందుకు భయపడ్డారు. కొందరు పెద్దల సహకారంతో కోర్టు పరిధిలో ఉన్నప్పటికీ మైనింగ్ అధికారుల నుండి ఎలాంటి అనుమతులు లేకుండానే తవ్వేస్తున్నట్లు విమర్శలు వస్తున్నాయి. ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి పనులకు మట్టిని తోలుతున్నట్లు అక్రమ రవాణా దారులు చెపుతున్నప్పటికీ ఆ మట్టి కేవలం కొందరు ప్రైవేటు వెంచర్ల చదునుకు, ఇంటి నిర్మాణాల బేస్ మట్టాల్లోకి తోలుతున్నట్లు ప్రజలు ఆరోపిస్తున్నారు. మట్టి తోలకాలు జరిపే టిప్పర్లు రోజు మొత్తం రోడ్లపై నిత్యం తిరగడం వల్ల ఆ వాహనాలు స్పీడుతో ప్రజలు బొంబేలు ఎత్తిపోతున్నట్లు స్థానికులు వాపోతున్నారు. ఇరుకు రోడ్లతో ఇబ్బంది పడుతున్న శ్రీనివాస్ నగర్ ప్రజలకు ఈ మట్టి తోలకల వల్ల మరింత ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు ప్రజలు విమర్శిస్తున్నారు.



