అర్హులైన ప్రతి ఒక్కరికీ ‘సంక్షేమ ఫలాలు’
గ్రామాలకు మెరుగైన రహదారి సౌకర్యాలు
స్థానిక బీటీపీఎస్ లో యువతకు అవకాశాలు
పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు
కాకతీయ, పినపాక: అభివృద్ధి సంక్షేమం రెండు కళ్ళు గా కాంగ్రెస్ పార్టీ పని చేస్తుందని అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందుతాయని పినపాక శాసనసభ్యులు పాయం వెంకటేశ్వర్లు అన్నారు. ఆదివారం పినపాక మండలం జానంపేట గ్రామంలో ఆయన పర్యటించారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ప్రతి హామీని అమలు చేస్తుందని తెలిపారు. గత ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పుల మయంగా మార్చిన మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆ అప్పులకు వడ్డీ కడుతూనే రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్నారని తెలిపారు. ఇందిరమ్మ ఇల్లు ఇవ్వని గ్రామం అంటూ తెలంగాణలో లేదన్నారు. సంక్షేమ పథకాలు అందించడంలో ఎప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ముందు ఉంటుందని తెలిపారు. ఆనాటి నెహ్రూ ప్రభుత్వం నుండి నేటి వరకు కాంగ్రెస్ పార్టీ ఎస్సీ ,ఎస్టీ ,బీసీల సంక్షేమం కోసం పెద్దపీట వేసిందని తెలిపారు. రాష్ట్రంలో కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటే బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కచ్చితంగా అమలు చేసే వారమన్నారు. కానీ బిజెపి బీఆర్ఎస్ ప్రభుత్వాలు డ్రామాలు ఆడుతున్నాయని తీవ్రస్థాయిలో మండిపడ్డారు. అసెంబ్లీలో 42 శాతం బీసీలకు రిజర్వేషన్ అమలు చేస్తామని ప్రకటించామని తెలిపారు. కావాలని కోర్టుకు వెళ్లి బీసీలకు ద్రోహం చేస్తున్నారని మండిపడ్డారు. బిజెపికి చిత్తశుద్ధి ఉంటే పార్లమెంటులో బిల్లు పెట్టి ఆమోదించాలన్నారు. అనంతరం జానంపేట ఎస్సీ కాలనీ నుండి 40 కుటుంబాలు ఎమ్మెల్యే పాయం సమక్షంలో కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. వారందరికీ పార్టీ కండువా కప్పి సాదరంగా పార్టీలోకి ఎమ్మెల్యే ఆహ్వానించారు. ప్రతి కార్యకర్తకు కాంగ్రెస్ పార్టీ కొండంత అండగా ఉంటుందని తెలిపారు. దళిత కాలనీలో అభివృద్ధి కాంగ్రెస్ ప్రభుత్వంలోనే జరుగుతుందని తెలిపారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. ధన ప్రవాహంతో గత బిఆర్ఎస్ నాయకులు ఏమి చేయాలో పాలు పోక తప్పుడు ప్రచారాలు చేస్తున్నారన్నారు. ప్రజలందరూ గమనిస్తున్నారని రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో వారికి తగిన బుద్ధి చెప్తారన్నారు.
ప్రతి కార్యకర్త ఒక సైనికుడిలా పనిచేసి ప్రతిపక్షాల నోరుమూయించాలన్నారు. అనంతరం జానంపేట గ్రామంలో నిర్మాణంలో ఉన్న ఇందిరమ్మ ఇళ్ళను పరిశీలించారు. ఇల్లు రాని ప్రతి పేదవాడికి ,అర్హుడికి ఇల్లులు రెండో విడతలో కేటా ఇస్తామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ మండల అధ్యక్షులు రామనాథం, కాంగ్రెస్ ఎస్సీ సెల్ నాయకులు బోడ రమేష్, యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు మనోజ్, మాజీ ఎంపీటీసీ హరీష్, కాంగ్రెస్, నాయకులు పేరం వెంకటేశ్వర్లు, రాజేష్, చందర్రావు, లక్ష్మణ్, గంగిరెడ్డి వెంకటరెడ్డి, గంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి పోకల కేశవులు, సుంకరి , కేత ప్రసాదు, స్వతంత్ర రెడ్డి, కాంగ్రెస్ పార్టీ నాయకులు ,కార్యకర్తలు, గ్రామస్తులు పాల్గొన్నారు.



